Mahatma Gandhi

విజయమో, వీరస్వర్గమో..!

Updated By ManamWed, 08/15/2018 - 01:18

 

gandhi

దేశమంటే కేవలం మట్టి కాదన్నాడు మహాకవి. దేశమంటే నిన్ను నువ్వు నిర్వచించుకునే ఏకైక నిఘంటువు. దేశమంటే కేవలం మ్యాపులో కనిపించే ఒక చిత్రం మాత్రమే కాదు. దేశమంటే సరిహద్దులు మాత్రమే కాదు. దేశమంటే నీతో కలిసి బతికే మనుషులు, నువ్వు కలిసి మెలిసిన తిరుగుతున్న మనుషులు, నువ్వు చదువుకున్న పుస్తకాలు, నువ్వు చూసిన సినిమాలు, నువ్వు పాడుకున్న పాటలు, నువ్వు పంచుకున్న ఉద్వేగాలు..., ఇవన్నీ కలిస్తేనే ‘నువ్వు’ అనే పదం సంపూర్ణార్ధకం అవుతుంది. నువ్వొక వాక్యానివైతే, నీ దేశమొక ఉద్గ్రంథం. ఆ ఉద్గ్రంథం నీదైన భాషలో రచించినదై ఉండాలి. అలా ఉండాలంటే నీ దేశం సార్వభౌమిక గణతంత్రమై ఉండాలి. నీ దేశం సర్వదా స్వతంత్ర దేశమై ఉండాలి. స్వతంత్ర భారతావని అన్నది మన పెద్దలు మనకు ఇచ్చిన వారసత్వ సంపద. నీ సొంత ఆస్తి కోసం, నీ సొంత హక్కుల కోసం నువ్వు పోరాడతావు. దేశం కూడా నీ ప్రాథమిక హక్కు. ఆ హక్కును ప్రసాదించిన భారత స్వాతంత్య్ర సంగ్రామం ఇవాళ తన 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, నాటి సంగ్రామ స్ఫూర్తిని మరొక సారి స్మరించుకుంటోంది

భారతీయ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ‘క్విట్ ఇండియా’ ఉద్యమం. అఖిల భారత కాంగ్రెస్ సమాఖ్య, బొంబాయి సమావేశాల సందర్భంగా 8 ఆగస్టు 1942న మహాత్మాగాంధీ స్థానిక గొవాలియా ట్యాంకు మైదాన్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటీషు వలసపాలనను అంతమొందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రసంగమే ‘క్విట్ ఇండియా’ ప్రసంగంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ప్రసంగంలోనే గాంధీజీ స్వాతంత్య్ర పోరాట లక్ష్యమైన ‘డూ ఆర్ డై’ (విజయమో, వీర స్వర్గమో...) అన్న నినాదాన్నిచ్చారు. అది రెండవ ప్రపంచ యుద్ధకాలమే అయినప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకులందర్నీ కటకటాల్లో బంధించింది. దేశం ఒక్కత్రాటి మీద నిలిచి, బ్రిటీషు వలస పాలనకు వ్యతిరేకంగా గర్జించింది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమ సారథి గాంధీజీ అలనాడు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలకు సంక్షిప్త అనువాదాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ‘ఇప్పుడు ఇక్కడ నెలకొన్న పరిస్థితులు ఎవ్వరి జీవితంలోను ఎదురై ఉండవు. కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ ముసాయిదా తీర్మానం అహింస పునాదులపై నిర్మితమైంది. మన పోరాట మార్గానికి మాతృక అహింసా విధానంలోనే ఉంది. మీలో ఏ ఒక్కరికైనా అహింసా విధానం మీద నమ్మకం సడలిపోయి ఉంటే, దయచేసి ఆ వ్యక్తి ఈ తీర్మానాన్ని బలపరచవద్దు. నా సంకల్పాన్ని నేను స్పష్టంగా చెబుతున్నాను. భగవంతుడు నాకు అహింస అనే ఆయుధాన్ని ప్రసాదించాడు. నేను, నా అహింసా మార్గం ఇవాళ పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నాం. నా ప్రపంచం ఇవాళ అహింసాగ్నిలో రగులుతూ, విముక్తి కోసం ఆక్రోశిస్తున్న ప్రస్తుత సంక్షోభంలో నేను భగవంతుడు నాకు ప్రసాదించిన వరాన్ని సరిగా ఉపయోగించక పోతే క్షమార్హుణ్ణి కాను. అందుకే నేను కార్యాచరణకు పూనుకోవాలి. రష్యా, చైనాల భద్రతకు భంగం వాటిల్లినపుడు నేను చూస్తూ కూర్చోలేను. 

మనది అధికారం కోసం ఉద్దేశించిన పోరాటం కాదు. కేవలం స్వాతంత్య్ర సాధన కోసం ఉద్దేశించిన అహింసాయుత పోరాటం. ఒక హింసాత్మక పోరాటంలో విజేత అయిన ఒకానొక సైనికనేత సైనిక కుట్రలో గెలిచి, నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టవచ్చు. అయితే కాంగ్రెస్ అహింసా మార్గంలో జరుపుతు న్న ఈ పోరాటంలో నియంతృత్వానికి చోటే లేదు. ఈ స్వాతంత్య్ర పోరాటంలో ఒక అహింసా యోధుడు స్వార్థ రహితంగా దేశ విముక్తి కోసం మాత్రమే పోరాడుతాడు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశాన్ని ఎవరు పరిపాలించాలన్నది ఇప్పుడు కాంగ్రెస్‌కు అప్రస్తుతం. అధికారం అంటూ వస్తే, అది పూర్తిగా భారత ప్రజలకే చెందుతుంది. అధికారాన్ని ఎవరికి అందించాలన్నది వారే నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రజలు అధికారాన్ని పార్సీలకే అందించవచ్చు, అది నా బలీయమైన వాంఛ కూడా. అలా కాకుండా కాంగ్రెస్‌లో ఇవాళ పేర్లు కూడా వినిపించని ఏ కొందరికైనా ప్రజలు అధికారాన్ని కట్టబెట్టవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ‘ఈ వర్గం చాలా అల్పమైంది, ఆ పార్టీ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించనే లేదు. అలాంటి పార్టీకి ఎందుకు అధికారాన్ని కట్టబెట్టాలి?’ అంటూ ప్రశ్నించడం మీ పని కాదు. ఆది నుంచి కాంగ్రెస్ మతపరమైన కళంకానికి అతీతంగానే ఉంది. యావద్భారతదేశమే కాంగ్రెస్ కార్యక్షేత్రం. అది తదనుగుణంగానే ప్రవర్తిస్తుంది. మనం అనుసరిస్తున్న అహింసా విధానం ఎంత అపరిపక్వంగా ఉందో నాకు తెలుసు. నిజమైన అహింసా ధర్మానికి మనం ఇంకా చాలా దూరంగానే ఉన్నామని కూడా తెలుసు. అయితే అహింసలో అంతిమ వైఫల్యం కానీ, ఓటమి కానీ ఉండదు. మనలో లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఒక మహత్తర విజయం మాత్రం మనకు అందివస్తుందని నాకు తెలుసు. ఇరవై రెండేళ్ళుగా మనం సాగిస్తున్న ధర్మదీక్ష మనకు విజయాన్నే ప్రసాదిస్తుందని నాకు తెలుసు. నేను కలలుగన్న ప్రజాస్వామ్యంలో..., అహింస ద్వారా ఆవిష్కృతమైన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. అలాంటి ప్రజాస్వామిక పోరాటంలోకి నేను ఇవాళ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి దీని పరమార్థం మీకు బోధపడితే, హిందువులు, ముస్లింల మధ్య బేధాభిప్రాయాల్ని మీరు మరచిపోతారు. మనమంతా భారతీయులమేనన్న స్పృహతోనే మీరు నడుచుకుంటారు. స్వాతంత్య్ర సాధన కోసం ఉద్దేశితమైన ఉమ్మడి లక్ష్యం కోసం మీరు పోరాడుతారు. ప్రతి ముసల్మాను యావద్భారతదేశాన్ని తన మాతృదేశంగా చెప్పుకునే సమయం వచ్చేసింది.  సత్యాగ్రహంలో ఎలాంటి అసత్యాలకు, మోసాలకు తావులేదు. స్వేచ్ఛాసాధన కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. విజయమో, వీరస్వర్గమో..., కాంగ్రెస్ మడమతిప్పకుండా పోరాడుతుంది!
- మహాత్మాగాంధీ

ఇవాళ మనం ఏ సందర్భంగానైనా, ఏ ప్రసంగం చివరిలోనైనా ఒక మాట వింటూంటాం..., అదే ‘జైహింద్!’ ఈ మాటకు రూపకర్త మన హైదరాబాదీనే!  బ్రిటీష్ వలసపాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పిం చేందుకు తోడ్పడాలంటూ జర్మన్ నియంత హిట్లర్ సహాయాన్ని కోరేందుకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 1941లో బెర్లిన్‌కు వెళ్ళారు. సాయుధ పోరాటమే మాతృదేశ శృంఖలాల్ని తెంచగలదని నేతాజీ ప్రగాఢంగా విశ్వసించే వారు. ప్రవాసంలోనే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా లని, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను  (భారత జాతీయ సైన్యం) రూపొందించాలని ఆయన సంకల్పించారు. యాభై వేల మంది సైనికు లతో ఏర్పాటు చేయదలిచిన ఈ సైన్యంలో ప్రధానంగా యుద్ధం లో జర్మన్ సేనలకు పట్టుబడిన భారతీయ ఖైదీల్ని సైనికులుగా తీర్చిదిద్దాలన్నది నేతాజీ అభిప్రాయం. జర్మన్ సైన్యంలాంటి సుశిక్షితులైన సైనికులతో పటిష్టమైన భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన వాంఛించారు. ఈ సైన్యంలోని ప్రతి ఒక్కరూ భారత స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా జీవించే వారై ఉండాలని ఆయన కోరుకున్నారు. 

జైహింద్!
అయితే ఈ విషయంలో నేతాజీకి ఒక సమస్య ఎదురైంది. అంతవరకు భారతదేశంలో సైనికులుగా నియమితులైన భారతీయులు మత, కుల ప్రాతిపదికనే సైన్యంలో పని చేసే వారు. అంటే రాజపుత్రులు, మద్రాస్ సాపర్స్, గూర్ఖాలు, సిక్కులుగానే గుర్తింపు పొందుతూ భారతీయులు బ్రిటీష్ సైన్యంలో పనిచేసే వారు. ఈ వైరుధ్యాల్ని రూపుమాపి, సైనికులందరూ ఉమ్మడి గుర్తింపుతో పనిచేయాల్సిన అవసరాన్ని నేతాజీ గుర్తించారు. అదే సమయంలో భారతీయ సైనికులు తమ మతాచారాల ప్రకారం పరస్ఫరం సంబోధించుకోవడాన్ని కూడా ఆయన గమనించారు. అంటే హిందువులైతే ‘రామ్ రామ్’ అని, సిక్కులైతే ‘సత్ శ్రీ అకాల్’ అని, ముస్లింలైతే ‘సలాం వాలేకుమ్’ అని పరస్ఫరం పలకరించుకునే వారు. ఈ సంప్రదాయాల్ని పక్కన పెట్టి, అందరూ ఒకే విధమైన అభినందనలతో పరస్ఫరం పలకరించుకోవాలని నేతాజీ నిర్ణయించారు. మరి ఆ అభినందన పదజాలం ఎలా ఉండాలి? ఆ అభినందన వాక్యం ఏవిధంగా ఉండాలి? ఈ విషయంలో నేతాజీకి సహాయమందించిన వ్యక్తి అబిద్ హసన్ సఫ్రానీ. ఈయన నేతాజీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. భారత జాతీయ సైన్యంలో మేజర్‌గా పనిచేశారు. అంతేగాక స్వతంత్ర భారత్‌లో తొలితరానికి చెందిన దౌత్య వేత్తల్లో అబిద్ ఒకరు.

imageఅబిద్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ఆయన కుటుంబం బ్రిటీష్ పాలనను వ్యతిరేకించేది. చిన్నతనం నుంచే అబిద్‌కి గాంధీజీ పట్ల అభిమానం మెండుగా ఉండేది. ఆయన కొంతకాలం సబర్మతీ ఆశ్రమంలో కూడా గడిపారు. తన సహాధ్యాయులందరూ ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు వెళితే, అబిద్ జర్మనీకి వెళ్ళి ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. అబిద్ 1941 లో జర్మనీలోనే నేతాజీని తొలిసారిగా కలిశారు. అప్పుడు నేతాజీ అక్కడి భారతీయ ఖైదీలతో సమావేశమయ్యారు. నేతాజీ రాజకీయ అభిప్రాయాలు అబిద్‌ని ఎంతగానో ఆకట్టుకున్నా యి. దాంతో ఆయన తన ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి, భారత జాతీయ సైన్యంలో చేరిపోయారు. అంతేగాక జర్మనీలో ఉన్నపుడు ఆయన నేతాజీకి దుబాసీగా కూడా వ్యవహరించారు. భారత జాతీయ సైన్యంలో సైనికులందరూ పరస్ఫరం సంబోధించుకునేందుకు ఒక అభినందన వాక్యాన్ని వెదికే పనిలో నేతాజీకి అబిద్ సహాయం చేశారు. ‘జైహింద్’ అనే పదబంధాన్ని అబిద్ సూచించారు. ఆ పదబంధం నేతాజీకి నచ్చింది. ఆయన ‘జైహింద్’ను విరి విగా ఉపయోగిస్తూ, సైనికులకు కూడా దాన్ని అలవాటు చేశారు. అటు తరువాత 15 ఆగస్టు 1947 నాటి తన ప్రతిష్ఠాత్మక ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగంలో పండిట్ నెహ్రూ కూడా ‘జైహింద్’ అంటూ నినదించారు. దాంతో ఇది జాతీయనినాదంగా మారిపోయింది.  అబిద్ 1984లో కన్నుమూశారు. 


బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటానికి నూట తొంభై ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రోద్యమం అనగానే మనకు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, భగత్‌సింగ్ వంటి నాయకులు గుర్తుకు వస్తారు. అయితే ఈ ఉద్యమాన్ని చివరి వరకు ముందుకు నడిపించిన కొన్ని చరిత్రాత్మక చిహ్నాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. 

వందేమాతరం జెండా
బెంగాల్‌ను లార్డ్ కర్జన్ 1905లో విభజించినప్పుడు మొదలైన ‘స్వదేశీ ఉద్యమం’ 1911 వరకు కొనసాగింది. బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలాలజపతి రాయ్‌ల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడిచింది. మతాలకు, కులాలకు, జాతులకు అతీతంగా ప్రజల్ని ఐక్యపరచడానికి ఒక జెండా అవసరం అని వారు భావించారు. ఆ సందర్భంగానే ‘కలకత్తా జెండా’ రూపొందింది. సచీంద్ర ప్రసాద్ బోస్ దీనిని రూపొందించారు. తరువాతి కాలంలో వందేమాతరం జెండాగా పిలుచుకున్న ఈ జెండాను 7 ఆగస్టు 1906న ఆవిష్కరించారు. 

ఆజాద్ హింద్ పతాకం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1940ల్లో భారతదేశానికి వెలుపల ప్రవాసంలో జరిగిన స్వాతంత్య్రోద్యమ చిహ్నంగా ఆజాద్ హింద్ పతాకం రూపొందింది. భారత జాతీయ సైన్య పతాకంగా ఇది కొనసాగింది. 

స్వేచ్ఛా ‘చిహ్నాలు’ చరఖా
మహాత్మాగాంధీ అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి సబర్మతీ ఆశ్రమం, రెండోది చరఖా. గాంధీ చరఖా ముందు కూర్చుని నూలు వడకే సన్నివేశం మనందరి మనస్సుల్లో కదలాడుతూనే ఉంటుంది. చరఖాను గాంధీ కేవలం నూలు వడికే యంత్రంగానే పరిగణించలేదు. ‘స్వదేశీ’, ‘స్వావలంబన’, ‘పరస్పర అనుబంధాలు’ అనే అంశానికి కూడా చిహ్నంగా గాంధీ చరఖాను పరిగణించే వారు. జాతీయోద్యమానికి ‘చరఖా’ ఒక శక్తిమంతమైన స్ఫూర్తిగా నిలిచింది. 

మూడు కోతులు
three-monkeys‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అనే సందే శమిచ్చే మూడుకోతుల శిల్పాన్ని గాంధీ ప్రేమించే వారు. భారతదేశంలో బ్రిటీష్ పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా గాంధీ ఈ మూడుకోతుల బొమ్మని ఉపయోగించారు. నిజానికి ఈ బొమ్మ జపానుకు చెందింది. ఈ మూడు కోతుల్లో ఒకదాని పేరు ‘మిజారు’ ’, ఇది కళ్ళని మూసుకుని ఉంటుంది. మరో కోతి పేరు ‘కికజారు’, ఇది చెవులను మూసుకుని ఉంటుంది. ఇక మూడో కోతి పేరు ‘ఇవజారు’.

 

రంగస్థల ప్రేరణతో భరతమాత 
దేశాన్ని ఒక తల్లి రూపంలో చూడడమన్న జాతీయ భావన నుంచి పుట్టిందే ‘భారతమాత’ అన్న పదం. కిరణ్ చంద్ర బెనర్జీ రచించి, 1873లో తొలిసారిగా ప్రదర్శించిన ఒక నాటకం ఈ జాతీయభావనకు ప్రేరణగా నిలిచింది. దేశచరిత్రలోbharat-matha అత్యంత దయనీయమైన కరవుకాలంగా 1770ల్లో సంభవించిన బెంగాల్ కరవును చెప్పుకుంటారు. ఆ కరవు పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ చంద్ర బెనర్జీ ఈ నాటకాన్ని రచించారు. ఒక మహిళ, ఆమె భర్త అడవుల్లోకి వెళ్ళి, అక్కడ తిరుగుబాటుదారులను ఎదిరిస్తారు. వాళ్ళని ఒక పూజారి అడవిలోని ఒక గుడికి తీసుకు వెళతాడు. ఆ గుడిలో భారతమాత ఉంటుంది. భారతమాత స్ఫూర్తితో ఆ దంపతులు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి, విజయం సాధిస్తారు... ఇది ఆ నాటకంలోని కథ. క్రమంగా ఈ కథలోని భారతమాత చుట్టూ దేశభక్తి, హిందూమతపరమైన విశ్వాసాలు అల్లుకున్నాయి. నాలుగు చేతులు కలిగి, కాషాయాంబరధారిణిగా ఉన్న మహిళగా  అబనీంద్ర నాథ ఠాగూర్ భారతమాతకు తన పెయింటింగ్ ద్వారా రూపమిచ్చారు. భరతమాత పచ్చటి పొలాల్లో నిలబడి ఉన్నట్టుగా ఉంటుంది. ఆమె పాదాల దగ్గర నాలుగు పద్మాలుంటాయి. నాలుగు చేతులు దైవశక్తికి ప్రతీకలుగా ఉంటాయి. భరతమాత ‘శిక్ష, దీక్ష, అన్న, వస్త్రాల్ని’తన పిల్లలకు ప్రసాదిస్తున్నట్టుగా ఉంటుందీ చిత్రం. వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీవిద్యాపీఠంలో భరతమాత దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో భరతమాత విగ్రహంతోపాటు, చలువరాళ్ళతో తీర్చిన భారతదేశ మ్యాపు కూడా ఉంటుంది. ఈ దేవాలయాన్ని శివప్రసాద్ గుప్తా, దుర్గాప్రసాద్ ఖత్రి అనే జాతీయవాదులు నిర్మించారు. దీనిని 1936లో మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ దేవాలయం అన్ని కులాలకు, మతాలకు, హరిజనులకు కూడా ప్రవేశం కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్టు గాంధీ చెప్పారు. భరతమాతకు హరిద్వార్, కోల్‌కతాల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండ్.. గాంధీయిజం!

Updated By ManamTue, 08/14/2018 - 16:56
mahatma gandhi

మ‌హాత్ముడు బోధించిన శాంతి, స‌త్యం, అహింసా సిద్ధాంతాల‌ను నేటి యువ‌త ఇష్ట‌ప‌డుతున్నారు. ఆయ‌న చెప్పిన వాటిపై ఆస‌క్తిగా అధ్య‌య‌నం, ప‌రిశోధ‌న‌లు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. గాంధీయన్ స్ట‌డీస్ ప్ర‌ధానాంశంగా తీసుకుంటున్న వారి సంఖ్య‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

గాంధియ‌న్ స్ట‌డీస్ స‌బ్జెక్టుగా 2017-2018 సంవ‌త్స‌రంలో అండ‌ర్‌ గ్రాడ్యుయేట్ స్థాయిలో 419 మంది, పీజీలో 796 మంది, ఎంఫిల్‌లో 51 మంది, పీహెచ్‌డీలో 78 మంది విద్యార్థులు త‌మ పేర్లు నమోదు చేయించుకోగా 17 మందికి పీహెచ్‌డీ ప‌ట్టాలు అంద‌జేశారు. ఇదే 2016-2017 కాలంలో అండ‌ర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 321 మంది, పీజీ 746, ఎంఫిల్ 67, పీహెచ్‌డీ 113 మంది న‌మోదు చేయించుకోగా 38 మందికి పీహెచ్‌డీ ప‌ట్టాలు ప్ర‌దానం చేశారు.

కానీ, మ‌హాత్మాగాంధియ‌న్ స్టడీస్ చైర్‌- ఏర్పాటు చేసుకోవాలంటూ యూజీసీ అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ దేశ‌వ్యాప్తంగా ఏ యూనివ‌ర్సిటీ కూడా ముందుకు రాలేద‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌నేదీ త‌మ‌కు అంద‌లేద‌ని కూడా తెలిపారు. నోబెల్ గ్ర‌హీత‌లు, ప్ర‌ముఖ వ్య‌క్తుల పేరుతో వ‌ర్సిటీల్లో చైర్ ఏర్పాటు చేసుకునే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు.చనిపోయేముందు గాంధీ 'హేరామ్' అనలేదా..?

Updated By ManamWed, 01/31/2018 - 07:24

Kalyanamనాథూరాం గాడ్సే తుపాకీ తూటాకు బలైన మహాత్మగాంధీ నేలకొరిగే ముందు 'హే రామ్' అనలేదని దశాబ్దం క్రితం గాంధీ సహాయకుడు వెంకిట కల్యాణం అన్న విషయం తెలిసిందే. అప్పట్లో అతడి మాట సంచలనం సృష్టించగా.. తాజాగా ఆ వివాదంపై స్పందించారు కల్యాణం. గాంధీజీ చనిపోయే ముందు 'హే రామ్' అన్నారో లేదో తనకు తెలీదని అన్నారు. ఆ విషయమే తాను చెప్పానని పేర్కొన్నారు.

గాంధీజీ 'హే రామ్' అనలేదని తాను ఎప్పుడూ చెప్పలేదని.. కానీ 'హే రామ్' అని అనడం తాను వినలేదని మాత్రమే చెప్పానని అన్నారు. గాంధీజీపై కాల్పుల జరిగిన సమయంలో అక్కడ అంతా గందరగోళమైన పరిస్థితి నెలకొందని, అక్కడున్న అందరూ అరుస్తున్నారని.. అందుకే గాంధీజీ ఏమన్నారో తనకు వినిపించలేదని చెప్పారు. అయితే 1943లో గాంధీజీ దగ్గర సహాయకుడిగా చేరిన కల్యాణం, గాంధీ మరణం వరకు అతడి వద్దే ఉన్నారు.గాంధీకి పలువురు నివాళులు

Updated By ManamTue, 01/30/2018 - 11:37

Sonia Gandhiన్యూఢిల్లీ: జాతిపిత మహాత్మగాంధీ 70వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు అతడికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునిల్ లంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరెందర్ సింగ్ దానోయా తదితరులు మహాత్మగాంధీకి తమ నివాళులను అర్పించారు. 

అంతకుముందే రాజ్‌ఘాట్‌కు చేరుకున్న సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సైతం మహాత్ముడిని స్మరించుకుని నివాళులు అర్పించారు. ఇక గుజరాత్‌లోని గాంధీ ఆశ్రమంలో కూడా మహాత్ముడిని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా గవర్నర్‌లు, సీఎంలు గాంధీ సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.మహాత్ముని హత్యపై పునర్విచారణ అక్కర్లేదు

Updated By ManamMon, 01/08/2018 - 15:03

Mahatma Gandhiదిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మహాత్మాగాంధీ హత్య కేసులో నాదురాం గాడ్సెతో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని గతంలో పంకర్ ఫడ్నిస్ అనే పిటిషనర్ బాంబే హైకోర్టులో పిటిషనర్ దాఖలు చేశారు. మహాత్ముని గుండెల్లోకి దూసుకెళ్లిన నాలుగో బుల్లెట్‌ను ఆ వ్యక్తే పేల్చినట్లు ఆరోపించారు. దీనిపై పునర్విచారణ జరిపి నాలుగో వ్యక్తి ఎవరో తేల్చాలని పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో గత ఏడాది ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గాంధీ హత్యోదంతంపై పునర్విచారణ జరిపించాలన్న తన డిమాండ్‌ను బలపరిచేలా కొన్ని  డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించారు. 

ఈ డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు చేత నియమితుడైన న్యాయవాది అమరేంద్ర శరణ్ పరిశీలించారు. మహాత్మాగాంధీని తునాతునకలు చేసిన సిద్ధాంతం, హంతకుడు, బుల్లెట్లును గుర్తించడం జరిగిందని, దీని కోసం వాడిన ఆయుధాన్ని స్వాధీనం కూడా చేసుకున్నారని అమరేంద్ర శరణ్ గుర్తుచేశారు. ఇక మహాత్ముని హత్యోదంతంపై పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. జాతిపిత హత్యోదంతంలో రెండో వ్యక్తి ప్రమేయాన్ని నిరూపించే బలమైన ఆధారాలేవీ పిటిషనర్ చూపించలేదని తేల్చారు. 

Related News