jai simha review

‘జై సింహా’ రివ్యూ

Updated By ManamFri, 01/12/2018 - 15:53

jaiచిత్రం: జై సింహా
తారాగణం: బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, డా. నటాషా దోషి, బ్రహ్మానందం, మురళీమోహన్, ప్రకాష్ రాజ్‌ త‌దితరులు
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
కూర్పు: ప్రవీణ్ ఆంటోనీ
సంగీతం: చిరంతన్ భట్
నిర్మాత: సి.కల్యాణ్‌
కథ, మాటలు: ఎం.రత్నం
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
విడుదల తేది: జనవరి 12, 2018

ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలని...ఆమె కోసం ఏ త్యాగమైనా చేసే ఒక యువకుడి కథే ‘జై సింహా’ చిత్రం. బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార జంట‌గా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ చిత్రంపై 'మనం' అందిస్తున్న సమీక్ష మీకోసం..

కథ: 
jaiiనరసింహా (బాలకృష్ణ), గౌరి (నయనతార) చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. పెరిగి పెద్ద‌య్యాక ప్రేమించుకుంటారు. పెళ్ళి కూడా చేసుకోవాల‌నుకుంటారు. అయితే.. ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా స‌హించ‌ని గుణం న‌ర‌సింహాది. ఆ కార‌ణంగానే త‌న‌ కూతురుని న‌ర‌సింహాకిచ్చి పెళ్ళి చేయ‌డానికి అభ్యంత‌రం చెపుతాడు.. స్కూల్ హెడ్ మాస్ట‌ర్ అయిన‌ గౌరి తండ్రి (ప్ర‌కాష్ రాజ్‌). న‌ర‌సింహా రౌడీయిజం వ‌ల్ల‌.. గౌరికి అడుగడుగున స‌మ‌స్య‌లే త‌ప్ప మ‌రేమీ ఉండ‌వని మాస్ట‌ర్ చెప్ప‌డంతో.. ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు న‌ర‌సింహా. గౌరి శ్రేయ‌స్సు కోసం న‌ర‌సింహా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? ఆ నిర్ణ‌యం వ‌ల్ల ఈ ఇద్ద‌రి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి అనేదే మిగిలిన క‌థ‌. ఈ క‌థ‌లో మంగ (హ‌రిప్రియ‌) పాత్ర కూడా కీల‌క‌మే.

విశ్లేషణ: 
jaiమాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన తెలుగు క‌థానాయ‌కుల‌లో బాల‌కృష్ణ‌ ఒక‌రు.  అలాంటి బాల‌య్య‌ని ఒక సిన్సియ‌ర్ ల‌వ‌ర్ పాత్ర‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌. దానికి బాల‌య్య శైలి పోరాట స‌న్నివేశాలు, పాట‌లు జోడించారు.  స్క్రీన్ ప్లే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప్ర‌థ‌మార్థంలో గ‌ర్భ‌గుడి ప‌విత్ర‌త‌ను, పూజారుల ప్రాధాన్య‌త‌ను చెప్పే స‌న్నివేశాన్ని.. ద్వితీయార్థంలో మ‌హాధ‌ర్నా స‌న్నివేశాన్ని అర్థ‌వంతంగా తెర‌కెక్కించారు. బాల‌కృష్ణ‌ను అగ్రెసివ్‌గా చూపిస్తూనే.. ప్ల‌జెంట్‌గానూ ప్రెజంట్ చేశారు. అయితే ప్ర‌థ‌మార్థాన్ని ఫ‌ర్వాలేద‌నిపించే రీతిలో  తెర‌కెక్కించిన ఆయ‌న‌.. ద్వితీయార్థం విష‌యానికి వ‌చ్చే స‌రికి ఆ స్థాయి క‌థ‌నాన్ని డిజైన్ చేసుకోక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. బాల‌కృష్ణకి ఇలాంటి పాత్ర‌లు కొత్త కాదు. అయితే.. ఆయ‌న్ని ఒక ప‌రిపూర్ణ ప్రేమికుడిగా చూపాల‌నుకోవ‌డం మాత్ర‌మే ఇందులోని కొత్త‌ద‌నం. వ‌య‌సు ప్ర‌భావం ఈ పాత్ర‌పై ప‌డినా.. బాల‌య్య మాత్రం పాత్ర‌లో లీన‌మ‌య్యారు. ఫైట్స్‌, సాంగ్స్‌లో ఎప్ప‌టిలానే మెప్పించారు. ఈ సారి సెంటిమెంట్ సీన్స్‌లోనూ రాణించారు. 'సింహా', 'శ్రీ‌రామ రాజ్యం' త‌రువాత మ‌రోసారి బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార‌.. ఆ రెండు సినిమాల మాదిరే ఇందులోనూ అభిన‌యానికి స్కోప్ ఉన్న పాత్ర‌లో హుందాగా క‌నిపించారు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌య‌న ఎక్స్‌ప్రెష‌న్స్ ఎప్ప‌టిలానే ఇంటెన్సిటీతో ఉన్నాయి. చాన్నాళ్ల త‌రువాత తెలుగు తెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చిన హ‌రిప్రియకి ఇందులో మంచి పాత్రే ద‌క్కింది. త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇక‌ న‌టాషా దోషి మాత్రం గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మైంది. ప్ర‌కాష్ రాజ్‌, ముర‌ళీ మోహ‌న్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌మ‌క‌లవాటైన పాత్ర‌ల్లోనే క‌నిపించారు. బ్ర‌హ్మానందం, ప్రియ మ‌ధ్య సాగే సన్నివేశాలు.. 'చంద్ర‌ముఖి'లో వ‌డివేలు, స్వ‌ర్ణ మ‌ధ్య సాగే సీన్స్‌ని గుర్తుకు తెస్తాయి. బాల‌కృష్ణకి క‌వ‌ల పిల్ల‌లుగా న‌టించిన బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడు.

సాంకేతికంగా తీసుకుంటే.. సి.రామ్ ప్ర‌సాద్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. కుంభ‌కోణం, వైజాగ్ స‌న్నివేశాల్లో ఆయ‌న కెమెరా ప‌నితనం మెప్పిస్తుంది. చిరంత‌న్ భ‌ట్ సంగీతంలో 'అన‌గ‌న‌గా', 'నీతోనే ఉంటా నీలోనే ఉంటా' విన‌సొంపుగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం చాలా స‌న్నివేశాల్లో తేలిపోయింది. ఎడిటింగ్ విష‌యానికి వ‌స్తే.. సినిమాకి మ‌రింత క‌త్తెర ప‌డాల్సింది. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ఆడియ‌న్స్‌ని అల‌రిస్తాయి. రత్నం రాసిన మాట‌ల్లో  ''పొలిటిషియ‌న్స్‌కి ఇచ్చే మ‌ర్యాద‌.. ప‌బ్లిక్‌కి కూడా ఇవ్వ‌డం నేర్చుకోండి'', ''గుండెలు ప‌గిలినా త‌ట్టుకున్న బాడీ ఇది. ఈ గుండాల దెబ్బ‌లు పెద్ద లెక్క కాదు'',  “సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి...నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి”,  “సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు...సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తది”, “బెదిరింపులు నా బాడీకి పడవు”, ''నేను నీలా చ‌దువుకోలే.. నాకు ఇంతే తెలుసు'' వంటి డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. “చావుకి వాస్తు లేదురా ఎక్కడినుంచైనా వస్తుంది...గౌరీ ఎప్పుడు సంతోషంగా ఉండాల్రా...తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను” వంటి మనసుకు హత్తుకునే మాటలను కూడా చాలా చక్కగా రాసారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
బాలకృష్ణ, న‌య‌న‌తార న‌ట‌న‌
ఫ‌స్టాఫ్‌
స్క్రీన్ ప్లే
పాట‌లు
ఛాయాగ్ర‌హ‌ణం
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌
కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం                                                                                                                        నేప‌థ్య సంగీతం
సెకండాఫ్‌
సినిమా నిడివి

చివరిగా...  సెంటిమెంట్ సింహం
రేటింగ్‌.. 2.75/5




Related News