pokiri

ఇష్టం లేకుండానే ‘పోకిరి’లో నటించా

Updated By ManamMon, 11/12/2018 - 11:47

Ileanaసూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘పోకిరి’ ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రంలో తాను ఇష్టం లేకుండానే నటించానని గోవా బ్యూటీ ఇలియానా చెప్పుకొచ్చింది. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా.. ఈ సినిమా చేయకూడదని తాను అనుకున్నానని, ఆ సమయంలో మహేశ్ సోదరి మంజుల తనను ఒప్పించారని చెప్పింది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని తాను అసలు ఊహించలేదని, అంతేకాకుండా తన సినీ కెరీర్‌కు ఆ చిత్రం చాలా ఉపయోగపడిందని వెల్లడించింది. ఆ తరువాత ఇష్టపడి చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయని తెలిపింది. కాగా దేవుడు చేసిన మనుషులు తరువాత టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా దాదాపు 6సంవత్సరాల తరువాత రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనితో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.మహేశ్ రికార్డును బ్రేక్ చేసిన చెర్రీ

Updated By ManamWed, 06/27/2018 - 11:22

Rangasthalam రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహేశ్ 12యేళ్ల రికార్డును బ్రేక్ చేశాడు చెర్రీ. మహేశ్ నటించిన ‘పోకిరి’ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లలో 1,61,43,091రూపాయలను కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును చెర్రీ ‘రంగస్థలం’ బ్రేక్ చేసింది.

అంతేకాదు ఆ కలెక్షన్లను ‘పోకిరి’ 189రోజుల్లో సాధించగా.. ‘రంగస్థలం’ 89 రోజుల్లోనే సాధించడం విశేషం. దీంతో చెర్రీ అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా మరోవైపు ‘రంగస్థలం’ ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం, నటీనటుల అద్భుత ప్రదర్శన, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి విభాగం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.ఏప్రిల్ 28.. తెలుగు సినిమాకు ప్ర‌త్యేకం

Updated By ManamSat, 04/28/2018 - 16:22

apr 28తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఏప్రిల్ 28వ‌ తేదీకి ప్ర‌త్యేక స్థానముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే తేదీన విడుద‌లైన కొన్ని సినిమాలు చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యం సాధించాయి. అలాగే మ్యూజిక‌ల్‌గానూ మెప్పించాయి. ఆ చిత్రాల వైపు కాస్త దృష్టి పెడితే..

అనార్క‌లి (1955) 
అంజ‌లీ దేవి టైటిల్ రోల్‌లో న‌టించిన చారిత్రక చిత్రం 'అనార్క‌లి'. స‌లీమ్‌గా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , అక్బ‌ర్‌గా ఎస్వీ రంగారావు న‌టించిన ఈ క్లాసిక్ మూవీకి వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పి.ఆదినారాయ‌ణ రావు సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా ఘంట‌సాల, జిక్కి ఆల‌పించిన 'రాజ‌శేఖ‌రా' పాట అయితే అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. 28 ఏప్రిల్ 1955న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

అడ‌వి రాముడు (1977)
మ‌హాన‌టుడు నంద‌మూరి తారక రామారావు కెరీర్‌లో 'అడ‌వి రాముడు' చిత్రానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. రామారావు, రాఘవేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్ర‌మిది. ఆ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో 11 సినిమాలు రాగా.. వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'కృషి ఉంటే మ‌నుషులు రుషులౌతారు', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. జ‌య‌ప్ర‌ద క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర పోషించారు. 28 ఏప్రిల్ 1977న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

య‌మ‌లీల (1994)
హాస్య న‌టుడిగా రాణిస్తున్న అలీని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. అప్ప‌ట్లో వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ కుటుంబ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ఫాంట‌సీ మూవీ 'య‌మ‌లీల‌'. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అలీ, మంజు భార్గ‌వి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంటాయి. ఇందులో య‌ముడిగా స‌త్య‌నారాయ‌ణ‌, చిత్ర గుప్తుడిగా బ్ర‌హ్మానందం చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ సినిమా త‌రువాత‌ య‌ముడి పాత్ర‌లాగే ప్రేక్ష‌కులు కూడా ఐస్ క్రీమ్‌ల‌ను హిమ క్రీములుగా పిల‌వ‌డం ఆన‌వాయితీ అయిపోయింది. ఇక‌ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో పాట‌ల‌న్నీ హిట్టే. ముఖ్యంగా 'సిరిలొలికించే చిన్ని న‌వ్వులే' పాట అయితే ఎవ‌ర్‌గ్రీన్‌. అలీకి జోడీగా ఇంద్ర‌జ న‌టించిన ఈ సినిమా 28 ఏప్రిల్ 1994న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

పోకిరి (2006)
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'పోకిరి'. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు హీరోను పోకిరిగా చూపించి.. చివ‌రి స‌న్నివేశాల్లో అత‌ను పోకిరి కాదు పోలీస్ అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసింది. ఇలియానా అందాలు, మ‌ణిశ‌ర్మ సంగీతం ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. పాట‌ల్లో 'గ‌ల గ‌ల పారుతున్న గోదారిలా' గుర్తుండిపోయే మెలోడీ అయితే.. 'ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే' అంటూ సాగే ప్ర‌త్యేక గీతం అయితే ఓ సెన్సేష‌న్‌. 28 ఏప్రిల్ 2006న విడుద‌లైన ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.

బాహుబ‌లి 2 (2017)
తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన 'బాహుబ‌లి' సిరీస్‌లో రెండో భాగంగా వ‌చ్చిన 'బాహుబ‌లి 2 - ది కంక్లూజ‌న్‌'.. జాతీయ స్థాయిలో రికార్డు వ‌సూళ్ళు ఆర్జించింది. అంతేగాకుండా.. తెలుగులో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌భాస్ టైటిల్ రోల్‌లో సంద‌డి చేయ‌గా.. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, రానా, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతంలోని పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'సాహోరే బాహుబ‌లి' పాట సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.  ప్ర‌భాస్‌, అనుష్కపై చిత్రీక‌రించిన 'ఓరోరి రాజా' విజువ‌ల్స్ ప‌రంగా మెప్పించింది. 28 ఏప్రిల్ 2017న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మొత్త‌మ్మీద‌.. 'అడ‌విరాముడు', 'పోకిరి', 'బాహుబ‌లి 2' వంటి ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాల‌న్నీ ఏప్రిల్ 28న రావ‌డం యాదృచ్ఛిక‌మైనా.. ఇలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాలు రిలీజైన తేదీ కావ‌డంతో ఏప్రిల్ 28 తెలుగు సినిమాకు ప్ర‌త్యేకంగా నిలిచింది. మున్ముందు కూడా ఇదే తేదీన మ‌రిన్ని సంచ‌ల‌న చిత్రాలు విడుద‌ల‌వుతాయేమో చూడాలి.             

                                                                                             - మ‌ల్లిక్ పైడిమెగా హీరోతో పూరీ పొలిటిక‌ల్ డ్రామా?

Updated By ManamSat, 04/21/2018 - 18:44

puriపూరీ జగన్నాథ్.. 'పోకిరి' లాంటి ఇండ‌స్ట్రీ హిట్‌ను తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి అందించిన ద‌ర్శ‌కుడి పేరిది. అలాంటి ఈ డాషింగ్ డైరెక్ట‌ర్‌కు ఇటీవ‌ల కాలంలో చెప్పుకోద‌గ్గ విజ‌యాలు లేవు. ఈ నేప‌థ్యంలో.. త‌న తాజా చిత్రం 'మెహబూబా'తో ఆ లోటు తీర్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు పూరీ. ఈ చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. 1971 ఇండో - పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాని.. ఒక సైనికుడికి, ముస్లిం యువతికి మధ్య జ‌రిగే ప్రేమకథగా తెర‌కెక్కించారు పూరీ. మే 11న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల త‌రువాత‌.. పూరీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఓ మెగా హీరోతో రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం. పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్‌ను కుదిరితే రామ్ చరణ్‌తో చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. లేని ప‌క్షంలో.. వరుణ్ తేజ్‌తో ఈ ప్రాజెక్ట్ చేసే దిశ‌గా పూరీ ఆలోచిస్తున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.మూర్ఛ వ్యాధి వ‌ల్లే ఈ గ్యాప్ - ముమైత్‌

Updated By ManamSun, 04/15/2018 - 21:47

mumaith“ఇప్పటికింకా నా వయసు నిండా ప‌ద‌హారే”  అంటూ కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేసిన బ్యూటీ ముమైత్ ఖాన్‌. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన 'పోకిరి' (2006)లో ఈ పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంతకుముందు ‘స్వామి’, ‘143’, ‘ఛత్రపతి’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌ చేసినా.. ముమైత్‌కు పేరు తెచ్చింది మాత్రం ‘పోకిరి’ సినిమానే. ఈ సినిమా తర్వాత వరుస ఐటమ్ సాంగ్స్‌తో తన హవాను చాటుకున్నారు ముమైత్‌. తెలుగు, తమిళం, హిందీ, క‌న్న‌డ‌, బెంగాలీ భాష‌ల్లో కలిపి దాదాపు 80 సినిమాల్లో నర్తించిన (న‌టించిన‌) ఈ సుందరి.. 2016లో వచ్చిన ‘తిక్క’ త‌రువాత‌ కనుమరుగైపోయారు.  ఇందుకు కార‌ణాన్ని తాజాగా సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చారు ముమైత్‌.

తాను రెండేళ్ళ పాటు మూర్ఛ‌ వ్యాధితో బాధపడ్డాననీ.. ఈ క్రమంలో ఈ వ్యాధి కోసం కొన్ని మందులు వాడాల్సి వచ్చిందనీ.. వాటి వల్ల బాగా లావైపోయాననీ.. దాని వలన సినిమాలకు కూడా దూరం కావలసి వచ్చిందని ఆమె తెలిపారు. అయితే ఒక్కసారి కోలుకుంటే తన దేహ సౌష్టవాన్ని మళ్ళీ కావల్సిన విధంగా పొందగలననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అంతే కాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు.. కంటి నిండా నిద్ర కూడా అవసరమేనని తెలిపారు. మన నుంచి ఇతరులు ఏమి ఆశిస్తున్నారు అనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోకూడదనీ.. అప్పుడే ఆనందంగా ఉంటామని చెప్పుకొచ్చారు. కాగా.. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1లో ముమైత్  పాల్గొని ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.   ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌బాంగ్ 3'

Updated By ManamThu, 11/16/2017 - 15:32

dabaang 3'ద‌బాంగ్‌'.. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం. ఇదే సినిమా తెలుగులో 'గ‌బ్బ‌ర్ సింగ్' గా రీమేక్ అయి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మంచి విజ‌యాన్ని అందించింది. కాగా, 'ద‌బాంగ్‌'కి సీక్వెల్‌గా వ‌చ్చిన 'ద‌బాంగ్ 2' కూడా హిట్ సినిమా అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా మ‌రో చిత్రం రానుంది. 'దబాంగ్ 3' పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. ఇప్పుడు ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడిగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  'పోకిరి' రీమేక్ 'వాంటెడ్' త‌రువాత ప్ర‌భుదేవా, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. తొలి భాగానికి అభిన‌వ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా.. రెండో భాగానికి స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రెండు భాగాల్లో హీరోయిన్‌గా న‌టించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది.రేపు స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న మంజుల‌

Updated By ManamTue, 11/07/2017 - 17:37

manjulaసూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సోద‌రి మంజుల నిర్మాత‌గానూ, న‌టిగానూ సుప‌రిచిత‌మే. 2002లో వ‌చ్చిన 'షో'తో న‌టిగా త‌న స‌త్తా చాటిన మంజుల‌.. ఆ త‌రువాత 'కావ్యాస్ డైరీ', 'ఆరెంజ్‌', 'సేవ‌కుడు' వంటి చిత్రాల్లోనూ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక నిర్మాత‌గా 'పోకిరి', 'ఏమాయ చేసావె' వంటి హిట్ చిత్రాల‌ను అందించారు.  ఇదిలా ఉంటే.. బుధ‌వారం ఆమె కొత్త మిష‌న్‌కి సంబంధించిన విష‌యాలు వెల్ల‌డికానున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అది ఆమె ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సినిమాకి సంబంధించిన విష‌య‌మ‌ని తెలిసింది. సందీప్ కిష‌న్, అమైరా ద‌స్త‌ర్ జంట‌గా మంజుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. బ‌హుశా దానికి సంబంధించిన వివ‌రాలే రేపు వెల్ల‌డ‌వుతాయో చూడాలి. కాగా, నాని హీరోగా విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజుల ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని ఈ మ‌ధ్య క‌థ‌నాలు వినిపించాయి.మ‌హేష్‌, కొర‌టాల సినిమా ఎప్పుడంటే..

Updated By ManamWed, 10/18/2017 - 12:27

'ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం' అనే కాన్సెప్ట్‌తో రూపొంది.. సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం 'శ్రీ‌మంతుడు'. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ల తొలి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం 2015లో విడుద‌లైంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతోంది. 'భ‌ర‌త్ అను నేను' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, మెసేజ్ ఉన్న చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంతో కైరా అద్వానీ తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యమ‌వుతోంది. కొర‌టాల గ‌త మూడు చిత్రాల‌కు సంగీత‌మందించిన దేవిశ్రీ ప్ర‌సాద్‌నే ఈ సినిమాకి కూడా స్వ‌రాలు అందించ‌నున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని.. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచార‌మ్‌. మ‌హేష్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన 'పోకిరి' కూడా ఏప్రిల్ నెల‌లోనే రిలీజైంది. మ‌రి 'పోకిరి' మ్యాజిక్ ఈ సినిమాకి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.ఆరేళ్ల 'దూకుడు'

Updated By ManamSat, 09/23/2017 - 11:43

'పోకిరి' వంటి ఇండ‌స్ట్రీ హిట్‌ త‌రువాత స‌రైన విజ‌యం లేని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకి బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ని అందించిన చిత్రం 'దూకుడు'. ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల‌తోనూ.. క‌థానాయిక స‌మంత‌తోనూ.. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌తోనూ.. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తోనూ.. మ‌హేష్ చేసిన మొద‌టి సినిమా ఇదే.

కుటుంబ విలువ‌లు, ప్రేమ‌, ప్ర‌తీకారం, హాస్యం.. ఇలా అన్ని అంశాల‌ను మేళ‌వించి తెర‌కెక్కించిన ఈ చిత్రం విజ‌య‌ఢంకా మోగించ‌డమే కాదు.. ప‌లు పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏడు నంది అవార్డుల‌ను సొంతం చేసుకుందీ సినిమా. ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం, ఉత్త‌మ న‌టుడు (మ‌హేష్‌బాబు), ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు (ప్ర‌కాష్ రాజ్‌), ఉత్త‌మ హాస్య‌న‌టుడు (ఎమ్మెస్ నారాయ‌ణ‌), ఉత్త‌మ ఎడిట‌ర్ (ఎం.ఆర్‌.వ‌ర్మ‌), ఉత్త‌మ ఫైట్ మాస్ట‌ర్ (విజ‌య‌న్‌), ఉత్త‌మ స్క్రీన్‌ప్లే రైట‌ర్ (శ్రీను వైట్ల‌).. ఇలా ఏడు నంది పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది 'దూకుడు'. 2011, సెప్టెంబ‌ర్ 23న విడుదలైన 'దూకుడు'.. నేటితో ఆరు వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది. 

Related News