road accident

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamTue, 11/13/2018 - 14:21
Couple dies in road accident

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కీసర-రాంపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా భార్యభర్తలు దుర్మరణం చెందారు. మారుతి ఆల్టో కారు (TS07 FN4548) అదుపు తప్పి ఎడమవైపు రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారు అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న  పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

Updated By ManamSat, 11/10/2018 - 15:16
Nellore  couple died in road accident

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పెళ్లకూరు మండలం గుర్రప్పతోట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నెల్లూరు స్టోన్‌హౌస్ పేటకు చెందిన గ్రంథి నాగేశ్వరరావు (55), ఆయన భార్య సులోచనమ్మ అక్కడికక్కడే మరణించారు. వీరు తిరుపతి నుంచి నెల్లూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టంకు తరలించారు.



సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Updated By ManamTue, 11/06/2018 - 12:10

Accidentసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



రోడ్డు ప్రమాదంలో  సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

Updated By ManamSat, 10/27/2018 - 16:43
CapGemini woman employee dies in road accident at Wipro Junction Gachibowli

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన  గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రమ్య, ప్రవీణ్ కుమార్... సెలవు రోజు కావడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళుతున్నారు.

ఈ క్రమంలో లారీని ఓవర్ టేక్ చేయబోయిన సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మరణించగా, ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రమ్య  క్యాప్ జెమినీలో ఉద్యోగిని. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.



ఆటో-లారీ ఢీ: ఆరుగురు దుర్మరణం

Updated By ManamMon, 10/22/2018 - 16:51
  • తూర్పుగోదావరి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం

  • మరో తొమ్మిదిమందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Road accident, Chebrole, Kakinada govt hospitalగొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తుని నుంచి కాకినాడకు వెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా మాకవరం పాలేనికి చెందిన వారంతా కాకినాడలో ఓ గృహ ప్రవేశానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మృతులు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి.వెంకటాపురానికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Updated By ManamThu, 10/18/2018 - 11:22

Road Accidentచిత్తూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి మండలం, మిట్టకండ్రిక వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో బస్సు, లారీ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Updated By ManamWed, 10/17/2018 - 09:22

Road Accident In Kurnoolకర్నూల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం, పెద్ద హోతురు సమీపంలో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. పిల్లలకు వెంట్రుకలు తీయించడానికి ఎల్లార్తి దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కర్నూల్ నగరంలోని ఓల్డ్ టౌన్‌కు చెందిన వారీగా గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్న చంద్రబాబు.. గాయాలపాలైన వారికి తక్షణం వైద్య సాయం అందించాల్సిందిగా ఆదేశించారు.



టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధిస్తోంది

Updated By ManamWed, 10/03/2018 - 09:25

Chandrababu Naiduఅమరావతి: రోడ్డు ప్రమాదంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలకు కోల్పోవడం తనను బాధిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి మరణించగా.. ఆయన మృతిపై చంద్రబాబు సంతాపాన్ని తెలిపారు. ఆ వార్త విని చాలా దిగ్ర్భాంతిని గురయ్యానని అన్నారు.

గాంధీ ఆదర్శాల కోసం పనిచేసిన మూర్తి ఆయన జయంతి నాడే చనిపోవడం యాదృశ్చికమని, మూర్తి ఆత్మకు శాంతి కలగలాని కోరుకుంటున్నానని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, విద్యావేత్తగా మూర్తి చెరిగిపోని ముద్ర వేశారని, ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. 



గీతం విద్యాసంస్థల అధినేత మూర్తి దుర్మరణం

Updated By ManamWed, 10/03/2018 - 07:49
MVVS Murthy no more-manam telugu news

విశాఖ :  గీతం విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమెరికా అలస్కాలోని ఆంకరేజ్ సిటీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న  వాహనం ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కుకు  గుద్దుకోవడంతో  మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు  మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. 

ఆంకరేజ్‌ సిటీ సమీపంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వీరంతా వెళుతుండగా ప్రమాదం జరిగింది. కాగా ఎంవీవీఎస్ మూర్తి ఈ నెల 6న కాలిఫోర్నియాలో జరిగే గీతం పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొనాల్సి ఉండగా ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మూర్తితో పాటు ఈ ప్రమాదంలో మరణించిన పాటు వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివ ప్రసాద్, విబిఆర్ చౌదరి భౌతికకాయాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతితో ఆయన కుటుబంతోపాటు గీతం విద్యాసంస్థల్లో విషాదం నెలకొంది. కాగా మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే పలువురు టీడీపీ నేతలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



సంగీత దర్శకుడు మృతి.. మాలీవుడ్‌లో విషాదం

Updated By ManamTue, 10/02/2018 - 12:02

Balabhaskarగత నెల రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ వయోలిస్ట్, మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కన్నుమూశారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో మాలీవుడ్ విషాదంలో మునిగింది. మంచి సంగీత దర్శకుడిగా పేరున్న బాలభాస్కర్ మరణం తమను బాధించిందని మాలీవుడ్ నటీనటుడు తమ సంతాపాన్ని ప్రకటించారు.

అయితే గత మంగళవారం త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. తిరువనంతపురం శివారు ప్రాంతంలో బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో బాలభాస్కర్ ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె తేజస్వి బాల అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడ్డ బాలభాస్కర్ చికిత్స తీసుకుంటూ ఇవాళ కన్నుమూశారు. మరోవైపు ఆయన భార్య లక్ష్మికి కూడా గాయలవ్వగా.. ఆమె కోలుకున్నట్లు సమాచారం. కాగా సంగీత కుటుంబంలో పుట్టిన బాలభాస్కర్ చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలో కొన్ని మలయాళ చిత్రాలకు సంగీతం అందించాడు. అలాగే వయోలిన్‌ను వాయించడంలో ప్రముఖుడిగా పేరొందిన బాలభాస్కర్ ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు. 





Related News