Bhakthi news

వరాలిచ్చే వరలక్ష్మి

Updated By ManamTue, 08/21/2018 - 00:20

imageశ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని  కొలుస్తారు. ఈ రోజున వరలక్ష్మిని పూజిస్తే సంవత్సరమంతా లక్ష్మీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
ఈ శుక్రవారం వరలక్ష్మీవ్రతం సందర్భంగా...

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం 
త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుంద ప్రియాం

స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడు. స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరింది. అప్పుడు శంకరుడు ఆమెకు వరలక్ష్మీ అనుగ్రహం పొందిన చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంది. 

వ్రత విధానం
మొదట పసుపుతో గణపతిని పూజించి, కలశంలోకి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. ఆమెకు షోడశోపచార, imageఅథాంగ పూజలు నిర్వహించాలి. తరువాత అష్టోత్తరశతనామాలను చదివి  ధూప, దీప, నైవేద్య, తాంబూలాలు సమర్పించాలి. కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించాలి. మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేయాలి.  

తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించాలి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పించాలి. ఆమెను మహాలక్ష్మిగా భావించి 
వాయనమీయాలి.శ్రీకనకధార-15

Updated By ManamTue, 08/21/2018 - 00:09

నమోస్తు  దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదరవల్లభాయై 

imageనమ్మి కొలిచిన భక్తులకు కొంగుబంగారం లక్ష్మీదేవి. ఆ తల్లి బ్రహ్మ ఆజ్ఞమేరకు తపస్సు చేసిన కారణంగా భృగు - ఖ్యాతి దంపతులకు పుత్రికగా జన్మించింది. బ్రహ్మమాసనపుత్రుడు, సప్తర్షుల్లో ఒకడైన భృగు మహర్షి తండ్రియైన బ్రహ్మ ఆదేశం మేరకు నిష్కామంగా తపస్సు చేశాడు. అందుకు పరాశక్తి ప్రసన్నురాలైంది. వరం కోరుకోమంటే ఆ మహర్షికి ఆదిపరాశక్తిని తన ఇంట నిలుపుకోవాలనుకోవడం తప్ప మరేదీ తోచలేదు. వెంటనే ఆ తల్లిని తన ఇంట పుత్రికగా ఉదయించమని కోరుకున్నాడు. అప్పడు ఆదిపరాశక్తి లక్ష్మీస్వరూపంలో భృగు ఇంట జన్మించింది. భార్గవి అయింది. మరోలా చెప్పాలంటే భృగు నిష్కామతపానికి మెచ్చి, ఆయనకు తండ్రిపదాన్ని అందించింది. ఆయనను భృగుసంహిత రచయితగా మారేలా చేసింది. అంతటి భక్తవరద ఆ తల్లి.

 భార్గవిగానే విష్ణుపత్ని స్థానాన్ని పొంది, ఆయన హృదయాధినేత్రి అయింది. కమలాధివా సినియైన ఆ తల్లికి ఉన్న లక్ష్మి అన్న పేరు కూడా జనోద్ధరణను సూచించేదే.  లక్ష్యాయిధి లక్ష్మిః- అంటే జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగింది అని అర్థం. ఆ తల్లే దామోదరుని పాణిగ్రహణంతో లోకమాతగా నిలిచింది. దామం అంటే తాడు. దాన్ని ఉదరంపై గలవాడు దామోదరుడు. సదా విష్ణుగళంలో ఉండే దామం వైజయంతి. అది విజయకారకం. బాలశంకరులు ఈ స్తుతి శ్లోకంలో  అమ్మవారి భక్తసులభతని, ఆశ్రితవరదత్వాన్ని, కోమలావాస స్థానాన్ని, ఆర్తోద్ధరణ పరాయణత్వాన్ని సూచించారు.  అంతేకాదు భృగు ప్రస్తావనలో అమ్మవారి విద్యాతత్త్వాన్ని, లక్ష్మీ శబ్దంతో అర్థతత్త్వాన్ని, దామోదర వల్లభత్వంతో శక్తితత్త్వాన్ని చెబుతూ స్వరూపాలు వేరైనా అమ్మవారు ఒక్కటే అని మార్మికంగా సూచించారు. ఇదిగదా శాక్తేయమైన అద్వైతం. భృగువంశపుత్రిక, విష్ణువక్షస్థలనిలయ, కమలాలయ, దామోదర ప్రియయైన ఓ లక్ష్మీదేవీ నీకు వందనం.
-డా. కె. పూర్ణప్రజ్ఞాభారతిఓ చిన్నదానా లే!

Updated By ManamTue, 08/21/2018 - 00:09

క్రీస్తు సందేశం
imageసమాజ మందిరపు అధికారియైన
యాయీరు అనేవాడొకడు వ్యధా జనిత హృదయంతో యేసు పాదాలపై పడ్డాడు. రోగగ్రస్తయైన నా కుమార్తెను బ్రతికించడానికి నా యింటికి రమ్మని అడిగాడు. ప్రభువు తన శిష్యగణంతో వెళ్తుంటే జనసమూహం ఆయనను చుట్టు ముట్టింది.  చిరకాలం నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభువును సమీపించడానికి శంకించింది. ఆయన వస్త్రాన్ని తాకినా ధన్యనవుతాననే ఘన విశ్వాసంతో ఆమె తాకింది. తక్షణమే రక్తస్రావం ఆగింది. అప్పుడు యేసు ఇలా ప్రకటించాడు. నా తేజోబలం ఒకటి ఇక్కడున్న మీలో ఒకరిలో చేరిందని పలికాడు. అప్పుడా స్త్రీ భయంతో వణకుతూ ప్రభువు చెంత రెండు చేతులూ జోడించింది. యేసు భయపడకు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచిందని పలికాడు.

అంతలో అధికారి తాలూకు దాసులు పరుగున అక్కడికి వచ్చారు. నీ కుమారుడు చనిపోయాడని కబురు చెప్పారు. క్రీస్తు ఆ అధికారితో భయపడకు అంటూ అతనితో కలిసి ఇంటిలో ప్రవేశించాడు. యేసు ఆ బిడ్డను చూచి ఈ బిడ్డ నిదురిస్తోంది అన్నాడాయన. అందరూ విస్తుబోయి చూస్తుండగా.... తలితాకుమీ - చిన్నదానా లెమ్మని నీతో చెబుతున్నా అని అరామి భాష (హెబ్రీ భాషలో ఒక మాండలికం)లో పలుకగానే బాలిక ప్రాణంతో కదులుతూ మంచంపై కూర్చుంది. ఈయన  దైవ కుమారుడు, లోకాన పవిత్రుడని అందరూ అంజలి పట్టారు. ప్రభువు పాదాలపై పడ్డారు.
ఈ అద్భుత క్రియ మత్తయి 9:18-26, మార్కు 5:21-43, లూకా 8:40-56లలో వర్ణితమైంది.త్యాగాల పర్వం బక్రీద్

Updated By ManamTue, 08/21/2018 - 00:02

imageదైవభక్తికి మహోన్నత నిదర్శనం బక్రీద్. త్యాగాలను స్మరించుకునే పర్వం. దైవప్రవక్త అయిన హజ్రత్ ఇబ్రహీం దైవాజ్ఞ మేరకు తన ఒక్కగానొక్క చిన్నారి తనయుని అల్లాహ్‌కు సమర్పించేందుకు సిద్ధం అయిన రోజు. ఇబ్రహీం త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ముస్లిం సోదరులంతా బక్రీద్ పండుగ జరుపుకుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో లక్షలాది మంది హజ్ యాత్రికులు కొలువై దేవా నీ సన్నిధికి చేరామంటూ నినదించే పవిత్రరోజు ఇది.

ముస్లిం సోదరులు జిల్ హజ్ మాసం పదోరోజున బక్రీద్ పండుగ జరుపుకుంటారు. చరిత్రలో ఈరోజుకు లక్షలాదిమందిimage హజ్ యాత్రికులతో కళకళలాడుతుంది. లబ్బైక్ (దేవా నీ సన్నిధిలో హాజరయ్యాను) అనే నినాదాలు సర్వత్ర మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ముహమ్మద్ ప్రవక్త సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో దైవగృహ ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారు కొందరైతే, సఫా, మర్వా అనే కొండల మధ్య పరుగులు (సయీ) తీసేవారు మరికొందరు ఉంటారు. 

హజ్, ఖుర్బానీలకు మూలం
అదొక అపురూప సుందర దృశ్యం. ఎంతో రమణీయమైన అద్భుత సన్నివేశం. ప్రభుస్తోత్రంతో తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అనుపమాన, అపూర్వ హజ్ దృశ్యాన్ని గురించి ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఆ ప్రాంతం ఎలాంటి జనసందోహం లేని నిర్జీవ ఎడారి ప్రాంతం. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ, ప్రపంచ ముస్లింలందరికీ ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ఈదు అల్ అజ్ అధా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు హజ్, ఖుర్బానీలకు  మూలకారణం హజ్రత్ ఇబ్రహీం అలైహిసల్సామ్.

కలను నిజం చేసిన త్యాగశీలి
ఇబ్రహీం (అస) గొప్ప దైవప్రవక్త. ఇబ్రహీంకు ఖలీలుల్లాహ్ అంటే అల్లాహ్ మిత్రుడు అన్న బిరుదు కూడా ఉంది. ఇబ్రహీం తన జీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించారు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞే అని తలపోసేవారు. వెంటనే దానిని ఆచరించేవారు ఒకనాడు ఆయన ఓ కలగన్నారు. నిజానికి ఆ కల ఓ పరీక్ష. మానవజాతి చరిత్ర కనీవినీ ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ఎలాంటి ప్రేమానురాగాలకు తావులేదని చాటిచెప్పిన అసాధారణ పరీక్ష అది. ఒకరోజు హజ్రత్ ఇబ్రహీం కన్నకొడుకుకు బలిదానం చేస్తున్నట్లు కలగన్నారు. దీన్ని దైవాజ్ఞగా తలచిన ఆయన ఈ విషయమై కొడుకును సంప్రదించారు. వృద్ధదశలో లేకలేక కలిగిన ఏకైక సంతానాన్ని దైవాదేశం మేరకు చేతులారా బలిచేయవలసి రావడం తండ్రికి పరీక్ష అయితే దైవప్రీతి కోసం ఎంతో భవిష్యత్తు కలిగిన నిండు జీవితాన్ని త్యాగం చేయాల్సి రావడం తనయునికీ పరీక్షే. అయినా ఆ తండ్రికి తగ్గ తనయుడు దైవకారుణ్య కొలనులో విరబూసిన చిరుమొగ్గ. ఏమాత్రం వెనుకాముందు ఆలోచించకుండా నాన్నగారూ! దైవాదేశాన్ని వెంటనే నెరవేర్చండి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు అన్నాడు. దీంతో ఇబ్రహీం తన ప్రాణం కంటే కూడా మిన్న అయిన కన్నకొడుకు గొంతు కొయ్యడానికి కుత్తుకపై కత్తిపెట్టి ఉద్యుక్తులయ్యారు. చిరుమొగ్గ ఇస్మాయిల్ కూడా దైవమార్గంలో తన చిన్నిప్రాణాన్ని ధారపోయడానికి సిద్ధమై, కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.

ఈవిధంగా తండ్రీకొడుకులిద్దరూ దైవాజ్ఞ ముందు తలవంచిన అపూర్వ ఘట్టానికి సృష్టి యావత్తు అచ్చెరువొందింది. వాయువు స్తంభించింది. సృష్టిలోని అణువణువు అవాక్కయింది. అంతటా నిశ్శబ్దం అవరించింది. అప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా దైవవాణి ప్రతిధ్వనించింది. నా ప్రియప్రవక్తా ఇబ్రహీం! నువ్వు నీ స్వప్న ఉదంతాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా ఈ పరీక్షలో మీరు అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అల్లాహ్ స్వర్గం నుంచి ఒక పొట్టేలును దైవదూత ద్వారా పంపించారు. ప్రవక్త ఇబ్రహీం ఆ పొట్టేలును బలిచేశారు. ఈ త్యాగాన్ని స్మరించుకోవడానికే ముస్లింలు ప్రతియేటా పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ అజ్హా అని, బక్రీద్ అని, ఈదె ఖుర్బాన్ అని త్యాగోత్సవం అని వ్యవహరిస్తారు. 
- ముహమ్మద్ లియాఖత్ ఉద్దీన్సత్యదేవునికి మఖానక్షత్ర అభిషేకం

Updated By ManamMon, 08/13/2018 - 00:33
  • అన్నవరం మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు

  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 

imageఅన్నవరం: సత్యదేవుడి 128వ ఆవిర్భావ వేడుకలలో భాగంగా స్వామివారి మూల విరాట్‌కు మఖానక్షత్ర అభిషేకాన్ని నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన విఘ్నే శ్వరపూజ, పుణ్యాహావచనం, దీక్షా వస్త్రధారణ, కలశస్థాపన వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అగ్నిప్రతిష్ట, మండపారాధన జరిగాయి.

నేటి సాయంత్రం ఫలపుష్పసేవ
సోమవారం స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం, నూతన యాగశాల ఆయుషు హోమం, ఉదయం పదిన్నర గంటలకు పూర్ణాహూతి, 10.45 గంటలకు ప్రాకారసేవ, 11.30 గంటలకు అవివేటి మంటపంలో పండిత సత్కారం, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఫల పుష్ప సేవ చేస్తారు. దీనికోసం నిత్య కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేస్తున్నారు. అనేక రకాల పండ్లు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ధర్మ సందేహాలు

Updated By ManamTue, 08/07/2018 - 02:31

దీపారాధన గాలికి కొండెక్కితే అపశకునంగా భావిస్తారు.  ఇది సరైన పనేనా? 
imageదీపారాధనను ఆర్పకపోవడం మన సంప్రదా యం. ఇది అగ్నిఆరాధనలో భాగం. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తారు. అక్కడ జ్వాల పెరిగితే, పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి భూమి, భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు. అగ్ని పెరగడానికి గాలి సాయపడుతుంది.

అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి ఆర్పివేస్తుంది. మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీక. అది నిరంతరం వెలుగుతూ ఉండాలి. అందుకే దీపం ఆరిపోతే అపశకునం అంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటామా? రక్షించుకోవడం మన బాధ్యత. అప్పుడే కొండెక్కిన దీపాన్ని మరోసారి వెలిగించవచ్చు. నిన్నటిరోజు చేసిన దీపారాధనలో మాత్రం నూనె, వత్తి కొత్తవి వేయకుండా దీపారాధన చేయ కూడదు. ధర్మ సందేహాలు

Updated By ManamTue, 08/07/2018 - 02:31

భగవంతునికి మొక్కులు ముడుపులు చెల్లించడం అవసరమా? మన డబ్బు భగవంతుడు ఆశిస్తాడా?

imageసర్వేగుణాః కాంచనమాశ్రయంతి అన్నారు. అంటే లోకంలోని మంచిచెడు గుణాలన్నీ ధనాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కలియుగ మానవులకు ఆశామోహాలు ఎక్కువ. అందుకే మనం ఎక్కువ సందర్భాల్లో స్వార్ధంతోనే ధనం సంపాదిస్తాం. మనలోని స్వార్ధగుణమే మన సంపదకు దోషాన్ని ఆపాదిస్తుంది. అటువంటి దోషాలన్నీ తీసేసి స్థిరమైన సంపదను అనుగ్రహించమని కోరుకుంటూ భక్తుడు హుండీలో డబ్బు వేస్తాడు. దేవుడి హుండీలో పడేదంతా పాపపు సొమ్ము అనకూడదు. ఆయనను చేరిన తర్వాత అదంతా పవిత్రత పొందుతుంది. 

దోషగుణాన్ని తీసివేసి వైరాగ్య సంపదను మనకు అనుగ్రహించేందుకు ఈ సంప్రదాయం ఉంది. సిరిసంపదలు కూడబెట్టడం గొప్పవిషయం కాదు. వాటిని ఇష్టపూర్తిగా వదులుకోవడంలోనే నిజమైన మానసిక ఆనందం ఉంది. ఇతరులకు ఇవ్వడంలోనే తృప్తి ఉంది.ఈ కానుకలు, ముడుపులు ఆయనకు మనమే ఇస్తున్నామనుకుంటే తప్పే అవుతుంది. ధన, వస్తురూపమైన ఐశ్వర్యంపై వైరాగ్యభావనతో ఆయనకు సమర్పించాలి. ఈ వైరాగ్యభావన నుంచే ముముక్షుభావన పెరుగుతుంది.శుభాల శ్రావణం

Updated By ManamTue, 08/07/2018 - 01:50

శ్రావణమాసం శుభాలకు నెలవు. మనవారు ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్రతాలు, నోములు చేపడతారు. మహావిష్ణువును, లక్ష్మిని, గౌరిని ప్రత్యేకంగా పూజిస్తారు. నోములు, పేరంటాలతో మహిళలందరూ ఈ నెల్లాళ్లూ కోలాహలంగా ఉంటారు. పసుపు పాదాలతో, శనగ వాయినాలతో శ్రావణమాసం ప్రతిరోజూ ఓ పండుగలా సాగిపోతుంది. ఈ ఆదివారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా....

image


చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు నెలల్లో అయిదోది శ్రావణమాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు. శ్రావణమాసంతో వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసమిది. వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను ప్రసాదించే దివ్యమాసం శ్రావణమాసం. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీమహావిష్ణు పూజకు ఉత్క ష్టమైన మాసం.

మాఘమాసంలో ఆదివారాలు, కార్తికమాసంలో సోమవారాలు, మార్గశిరమాసంలో గురువారాలు పుణ్యప్రదమైనవి. శ్రావణమాసంలో మాత్రం మంగళ, శుక్ర, శనివారాలు మహత్తు కలిగినవి.... ప్రధానమైనవి. శ్రావణంలో మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శనివారాల్లో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. 
మాసం మొదటి తిథి అయిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండే పదిహేను రోజులనూ శుక్లపక్షం అంటారు. ఇవి ఎంతో విశేషమైనవి. ఒక్కోరోజు ఒక్కోదేవుని పూజించాలని, పవిత్రారోపణోత్సవాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పవిత్రం అంటే దర్భలతో తయారు చేసిన వేలి తొడుగు. దర్భ అత్యంత పవిత్రమైనది. అటువంటి దర్భను ఉపయోగించి 108 ముడులతో కాశీదారంలా తయారుచేసి దానితో ఆయాదేవుళ్లను అలంకరించి పూజిస్తారు. 

శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు పూజించవలసిన దేవతల పేర్లు వరుసగా చెప్పాలంటే... పాడ్యమి-బ్రహ్మదేవుడు, విదియ- శ్రియఃపతి, తదియ-పార్వతీదేవి, చవితి- వినాయకుడు, పంచమి-చంద్రుడు, షష్ఠి- సుబ్రహ్మణ్యస్వామి, సప్తమి-సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి-మాత దేవతలు, దశమి- యమధర్మరాజు, ఏకాదశి-మహర్షులు, ద్వాదశి -శ్రీమహావిష్ణువు, త్రయోదశి-మన్మథుడు, చతుర్దశి -శివుడు, పూర్ణిమ-పిత దేవతలు..... ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కోరోజుకు ఒక్కోదేవతను పూజించడం వల్ల సంవత్సరంలో చేసే పూజలన్నీ పవిత్రమవుతాయంటారు. ఎటువంటి సమస్యలూ రావని, సంపద వృద్ధి చెందుతుందని చెబుతారు. 
వ్రతాలు, నోములను చేపట్టడానికి శ్రావణం శుభకరమైన మాసం. శ్రావణమాసంలోని మంగళవారాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మంగళగౌరీ వ్రతం చేస్తారు. అయిదేళ్లపాటు కొనసాగించే మంగళగౌరీ వ్రతం సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇంకా పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. వర్షరుతువులో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవలసిన శనగలను నానబెట్టి మహిళలు పంచుకుంటారు. బురదనీటిలో తిరిగే కాళ్లకు అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ముత్తయిదువలు ఒకరి కాలికి మరొకరు పసుపు పారాణి దిద్దుతారు. వాయినాల పేరుతో స్త్రీల మధ్య ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరుస్తాయి.

వేంకటేశ్వరస్వామి భక్తులకు శ్రావణమాసం అతిముఖ్యమైనది. వేంకటేశ్వరుని వద్ద శ్రావణంలోని ఏదో ఒక శనివారం నాడు పిండి దీపారాధన చేస్తారు. బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం లేదా చక్కెర కలిపి చలిమిడిలా సిద్ధం చేసుకోవాలి. దానిని ప్రమిదలా నొక్కి తయారు చేసుకుని ఆవునెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. శ్రీవేంకటేశ్వరుని శక్తికొద్దీ పూజించి నైవేద్యం సమర్పించాలి. దీపం కొండెక్కిన తరువాత చలిమిడిని ప్రసాదంగా స్వీకరించాలి. మాసాలలో కెల్లా శుభకరమైన శ్రావణమాసంలో ఆచరించిన పూజలు శీఘ్రఫలితాలను ఇస్తాయి.శ్రీకనకధార-13

Updated By ManamTue, 08/07/2018 - 01:50
  • నమోస్తు నాళీకనిభాననాయై.. నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై 

  • నమోస్తు సోమామ తసోదరాయై.. నమోస్తు నారాయణవల్లభాయై 

imageఅమ్మవారు జగదేకసౌందర్యశోభిత. ఆ తల్లి మనస్సు ఎంత నవపల్లవ సమమో, మూర్తి సొందర్యం కూడా అంతే మహత్తరం. అందుకే బాలశంకరులు ఆ తల్లిని అమేయమైన ఉపమానాలతో కీర్తించి నమస్కరించారు. పద్మం, ఏనుగు కుంభస్థలం, ముత్తైదువల పాపిట, మారేడుదళం వెనుక భాగం, గోపృష్టం లక్ష్మీ నివాసస్థానాలని పెద్దలు చెబుతారు. ఆ పద్మాసనస్థ ముఖారవిందం నాళీకనిభతో మెరుస్తుంది. నాళీకం అంటే పద్మం. దాని సౌకుమార్యం, సౌందర్యం లోకవిదితాలే. ఆ సోయగంతో పోటిపడే అందం అమ్మవారిది. అందుకే అమ్మవారు సితోత్ఫుల్లపద్మవదన. అంటే పూర్తిగా వికసించిన తెల్ల కలువ వంటి ముఖసౌందర్యం గలది. ఆ తల్లి పుట్టిన ప్రదేశం పాలకడలి. దేవతలకు, రాక్షసులకు అనేక శుభకరమైన వస్తుతతిని, జీవతతిని అందించిన రత్నార్ణవం.

ఆ పాలకడలిలో పుట్టిన ఆ తల్లి సోయగమూ దుగ్ధసమానమే కదా! ఇక ఆమె తోడుగా పుట్టింది కూడా సామాన్యమైనవారు, సామాన్యమైన నిధులూ కావు. అమృతాన్ని తన కిరణాల్లో వెదజల్లే చంద్రుడు ఆమె తమ్ముడు, సాక్షాత్తు ఆ అమృతమే ఆ తల్లి తరువాత ఉద్భవించిన ఆమె చెల్లెలు. తమ్ముడు, చెల్లెలే అంత ఔన్నత్యం కలవారైతే, వారికి ముందు ఉద్భవించిన అక్కది మరెంత ఘనతో గదా! తన తోడుగా క్షీరసాగరమథనంలో ఉదయించినవన్నీ దేవతా గణాలలోని అధికారులను వరిస్తే, అమ్మవారు ఏకంగా జగత్పతినే వరించింది. జగదేకమాతగా నిలిచింది. చిన్నికూనలమైన మనపై ఆ జగదేక కుటుంబిని ప్రేమ ఎంతగా కురిస్తే అంతగా మనం వృద్ధిలోకి వస్తాం. శుభంకరమైన జీవితాన్ని గడుపుతాం. పద్మం వంటి సోయగమున్న ముఖారవిందాన్ని కలిగిన మాతకు వందనం. క్షీరసముద్ర సంజాతకు నమస్సులు. చందురునికి, అమృతానికి తోబుట్టువైన తల్లికి ప్రణతులు. నారాయణుని ప్రియప్రితికి నమస్కారం.
- డా. కె. పూర్ణప్రజ్ఞాభారతిదైవవాణి

Updated By ManamTue, 08/07/2018 - 01:01
  • ఆదర్శ కుటుంబం  

imageకుటుంబ బంధం వల్లనే కొత్తతరం ఉనికిలోకి వస్తుంది. బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. కుటుంబంలోని వారు తమ తరువాతి తరం వారి కోసం విస్త తమైన బాధ్యతలను, ప్రేమను, త్యాగనిరతిని కలిగి ఉంటారు. అందుకే కుటుంబ వ్యవస్థను ఉత్తమమైన, పటిష్టమైన ఆధారాలపై నిలబెట్టాలంటుంది ఇస్లాం. కుటుంబ వ్యవస్థ పటిష్టమైతే సమాజం పటిష్టమవుతుంది. కుటుంబ వ్యవస్థకు మూలమైన నికాహ్‌ను (వివాహం) ఇస్లాం కేవలం ధర్మబద్ధం చేయడమే కాకుండా అది ఒక సత్కార్యంగా, పుణ్యప్రదమైన ఆరాధనగా పరిగణిస్తుంది. కుటుంబ సంరక్షుకుడు పురుషుడే. సంతానం తల్లిదండ్రులకు విధేయత చూపాలి. పిల్లల బాధ్యతలను తల్లి, హక్కులను తండ్రి నిర్వర్తించాలి. ఆదర్శ కుటుంబ జీవనం అనేది భార్యాభర్తల పవిత్రబంధంతో ప్రారంభమవుతుంది. భార్యపట్ల సత్ప్రవర్తనతో మెలగాలి. ఆమెను గౌరవించాలి. ఆమె ఎడల మేలును, త్యాగబుద్ధిని కలిగి ఉండాలి.

వారితో సద్వర్తనంతో సంసారం చేయండి. (నిసా) విశ్వాసులకు ఇలా బోధించబడింది : మీకు ఏ కారణం చేతనైనా, ఆమె ఇష్టం లేకపోవచ్చు. మీకు ఇష్టం లేని వస్తువులోనే అల్లాహ్ బహుశా మీ కొరకు ఎంతో మేలు పొందుపరిచి ఉండవచ్చు. (దివ్యఖురాన్ 4:19)

ప్రతివారిలో ఏదో బలహీనత ఉంటుంది. అల్లాహ్ పై భారం వేసి జీవితభాగస్వామితో సర్దుకుపోవాలి. కుటుంబంతో సుఖసంతోషాలను పంచుకోవాలి. భార్య ధార్మికత, నైతికత వంటి సుగుణాలను కలిగిఉంటే ఆమె వల్లనే కుటుంబం వర్ధిల్లుతుంది. అందుకే దైవప్రవక్త (స) ఏమన్నారంటే, ‘‘మీ నడవడిలో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల ఎడల అత్యధికంగా మంచిగా మెలిగేవారే మీలో అందరి కంటే మంచి నడవడిక కలవారు’’ అని. ప్రవక్తవారి ప్రకారం తల్లిదండ్రుల హక్కులు అల్లాహ్ హక్కులతో సమానమైనవి.
- ముహమ్మద్ లియాఖత్ ఉద్దీన్

Related News