2000 notes

సడన్ షాకిచ్చిన బ్యాంకులు

Updated By ManamThu, 03/22/2018 - 08:50

Banks Refusing Soiled New Currency Notes

హైదరాబాద్: మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముందున్న నోట్లకు ఇప్పుడొచ్చిన కొత్త నోట్లకు చాలా తేడా ఉంటుంది. రంగురంగులుగా నోట్లు రావడంతో కాస్త కలర్ పోయినా.. చిరిగినట్లుగా ఉన్నవాటిని ఇది వరకు మార్చుకోవడానికి బ్యాంకులు వెసులుబాటు కల్పించాయి. అయితే ఇకపైన చిరిగిన నోట్లు తీసుకునేది లేదంటూ  బ్యాంకులు సడన్ షాకిచ్చాయి. అంతేకాదు మీరు ఆర్బీఐకి వెళ్లి అష్టకష్టాలు పడినా సరే తీసుకునే పరిస్థితులే ఉండవు. మీ నోటు చిరిగితే మాత్రం ఇక అంతే సంగతులు అన్నమాట. చిరిగిన నోటును ఇంట్లో పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు.

అసలు కారణమిదీ..
పెద్ద నోట్లు రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి ఏడాదిన్నర అవుతున్నా... కొత్త నోట్లకు సంబంధించి చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు ఇప్పటికీ రాలేదు. దీంతో ఒక వేళ చిరిగిన నోట్లు బ్యాంకులు తీసుకున్నా.. వాటిని కూడా కౌంటింగ్‌‌లో లెక్కలు తేల్చాల్సిందే. ఈ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వచ్చినా కష్టమే. వాటిని తిరిగి బ్యాంకుల వద్దకు తీసుకెళ్లినా పెద్ద ప్రయోజనం ఉండదు. చిరిగిన నోట్లను తీసుకోవట్లేదని సింగిల్ మాటతో బ్యాంకు సిబ్బంది ఒక్క మాటలో తేల్చేస్తుందంతే.

దాచిపెట్టుకోండి.. తర్వాత చూద్దాం..!
చిరిగిన నోట్లను తీసుకుని జనాలు బ్యాంకుల దగ్గరికెళితే.. ‘నోట్లన్నీ దాచిపెట్టుకోండి.. తర్వాత చూద్దాం’.. ఇదీ సిబ్బంది నుంచి వస్తున్న ఏకైక సమాధానం. దీంతో తీవ్ర నిరాశతో.. అత్యవసరానికి డబ్బులు లేక జనాలు ఇంటిబాట పడుతున్నారు. తమ నుంచి ఆదేశాలు వచ్చేవరకు చిరిగిన/ దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. 

డబ్బులు దొబ్బేస్తున్నారు.. ఓ వైపు బ్యాంకులు నోట్లను తీసుకోకుండా తిరస్కరిస్తుండటంతో అత్యవసరాలకు డబ్బుల్లేక దేశ వ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక జనాలు తలలుపట్టుకుంటున్నారు. దీన్నే అదనుగా తీసుకుంటున్న కొందరు.. చిరిగిన నోట్లను తీసుకుంటామని చెప్పి  భారీగా కమీషన్ల దందాకు తెరలేపుతున్నారు. బ్యాంకులకు సమీపంలో తమ పని కానిచ్చేస్తున్నారు. రూ.2 వేల చిరిగిన నోటుకు రూ.500 నుంచి వెయ్యి వరకు కమీషన్ తీసుకున్నారు. ఇక, రూ.500 చిరిగిన నోటు మార్పిడికి రూ.200 నుంచి 300 వరకు కమీషన్‌గా తీసుకుంటున్నారు. అయినా సరే మా నోట్లు చేతులు మారితో చాలంటూ చిరిగిన నోట్ల బాధితులు అతి బలవంతంగా మార్చుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ‘మార్పిడి చేసుకునే రోజు’ వస్తుందేమో అని వేచి చూస్తున్నారు.

Banks Refusing Soiled New Currency Notesరద్దు.. 2000

Updated By ManamWed, 09/27/2017 - 13:12
  • 2000 నోట్లను రద్దు చేసేయాలి

  • అప్పుడంటే అవసరం కాబట్టి తెచ్చారు

  • ఇక మీదట ఆ పెద్ద నోట్ల అవసరం లేదు

  • వాటి వల్ల అవినీతి ఇంకా ఎక్కువవుతుంది

  • కేంద్రం రద్దు దిశగా చర్యలు తీసుకోవాలి

  • డిజిటల్ కరెన్సీ తీసుకొస్తేబాగు: చంద్రబాబు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: నోట్ల రద్దు వల్ల పెద్ద..పెద్ద వ్యాపారుల సంగతేమో గానీ, మధ్యతరగతి వాళ్లు, పేదలే ఎక్కువగా బాధపడ్డారు. సమయానికి డబ్బులందక ఇక్కట్లు పడ్డారు. మరి, మళ్లీ నోట్ల రద్దు జరిగితే.. నోట్ల రద్దు 2.0ను తీసుకొస్తే... వామ్మో ఇంకేమైనా ఉందా..? కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నోట్ల రద్దు 2.0 జరగాల్సిందేనంటున్నారు. అవును, 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నోట్ల రద్దుపై ప్రధాని వేసిన కమిటీకి ఆనాడు చంద్రబాబు చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఏపీ సీఎం.. ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఏ సంస్కరణ చేపట్టినా సత్ఫలితాలు రావడం కొంత ఆలస్యమవుతుంది. సహజంగానే పెద్ద నోట్లు సమస్యలను సృష్టిస్తాయనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ నోట్ల వల్ల అవినీతి ఎక్కువగానే జరుగుతుంది. రాజకీయ కోణంలోనూ ఇప్పుడున్న 2 వేల నోట్లు సమస్యలను సృష్టిస్తాయి. అసలు కరెన్సీ నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని తీసుకొస్తే బాగుంటుంది. అది తక్కువ ఖర్చుతో కూడుకున్నపనే. అందునా త్వరితగతిన సంస్కరణలను సులువుగా చేయవచ్చు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2 వేల నోట్లను తీసుకురావడం ప్రధాని మోదీ చేసిన పెద్ద తప్పంటారా అని ప్రశ్నించగా.. నోట్ల రద్దు వల్ల భారీ మొత్తంలో నగదు వ్యవస్థ నుంచి వెళ్లిపోయింది కాబట్టి ఆ సమయంలో 2 వేల నోట్లను విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడు వాటి అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, జీఎస్టీ వల్ల కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అరుణ్ జైట్లీతో మాట్లాడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాల్సిందిగా కోరామని చెప్పారు. 

Related News