under19cricketer

కుర్రాళ్లకు నగదు నజరానా: బీసీసీఐ

Updated By ManamSat, 02/03/2018 - 21:46

under19రికార్డు నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ సాధించిన పృథ్వీ సేనకు భారీ మొత్తంలో నగదు నజరానా ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, యువ జట్టులోని ప్లేయర్స్ అందరికీ ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇవ్వనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా కమిటీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటర్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీ సేనపై ప్రశంసలు గుప్పించారు. ‘దేశానికి గర్వకారణంగా నిలిచిన అండర్-19 జట్టును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన హయాంలో క్రికెట్‌ను చిత్తశుద్ధితో ఆడారు. కుర్రాళ్లను కూడా అదే రీతిలో తీర్చిదిద్దడం అభినందనీయం. వీళ్లు అద్భుతమైన ప్లేయర్స్ మాత్రమే కాదు.. భారత క్రికెట్‌కు అద్భుతమైన ప్రతినిధులు కూడా. కుర్రాళ్లందరూ చక్కని ప్రతిభ కనబరిచారు. మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని.. భవిష్యత్తులో సీనియర్ జట్టులో చోటు సంపాదిస్తారని భావిస్తున్నాను’ అని వినోద్ రాయ్ అన్నారు.ద్రవిడ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది

Updated By ManamSat, 02/03/2018 - 21:23

వరల్డ్ కప్ టైటిల్ విజయంపై మాజీ కెప్టెన్ ఉన్ముక్త్
under19న్యూఢిల్లీ: చివరికి ఆమోదయోగ్యమైన, సమగ్రమైన విజయాన్ని భారత యువ జట్టు సొంతం చేసుకుంది. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై పృథ్వీ సేన విజయం సాధించి నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అన్నాడు. ‘యువకులందరికీ రాహుల్ ద్రవిడ్ గొప్ప గిఫ్ట్. సాహసవంతులుగా పేరు తెచ్చుకున్న ఈ యువకులందరికీ ద్రవిడ్‌లోని సూక్ష్మబుద్ధి సహాయపడింది. కుర్రాళ్లందరూ ప్రొఫెషనల్ ప్రతిభ కనబరిచారు. ఈ ఘనత ద్రవిడ్ ఒక్కడిదే. వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయం. ప్రపంచమంతా వీరిపై దృష్టిసారించేందుకు వీళ్లు అర్హులు. వీళ్లలో చాలా మందికి ఇప్పటికే ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరికింది. అయితే తొలి దేశవాళీ సీజన్‌లో వీళ్లకు అసలు పరీక్ష ఎదురవుతుంది. అందులోనూ ఇదే జోరును కొనసాగించాలి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో బీసీసీఐ నిరంతరం శ్రమిస్తోంది. మనకు దేశవాళీ టోర్నీలు అనేకం ఉన్నాయి. ప్రతిభావంతులైన యువకులను ప్రోత్సహించేందుకు అభిమానులకు కూడా కొదువ లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ కూడా యువకులకు ఎంతో ఉపయోగపడుతోంది’ అని ఉన్ముక్త్ అన్నాడు.జై హో భారత్

Updated By ManamSat, 02/03/2018 - 20:14
 • రికార్డు నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు  

 • ఫైనల్లో ఆస్ట్రేలియాపై పృథ్వీ సేన గెలుపు - మనోజ్ అజేయ సెంచరీ  

 • అన్ని విభాగాల్లో రాణించిన భారత యువసేన - కెప్టెన్ షా రికార్డు - అన్ని వర్గాల నుంచి ప్రశంసలు 

 • రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభినందనలు - బీసీసీఐ నగదు పురస్కారం

 • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనోజ్ కల్రా

 • మ్యాన్ ఆఫ్ ది సిరీస్ శుభ్‌మన్ గిల్

under19

మౌంట్‌మాంగనీ: మనోజ్ కల్రా అజేయ సెంచరీ, పేస్ బౌలర్ల అద్భుత బౌలింగ్ వెరసి ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్ గెలిచింది. శనివారమిక్కడ జరిగిన ఫైనల్లో 8 వికెట్లతో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ కాగా.. తర్వాత భారత్ 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. మనోజ్ 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (47 నాటౌట్) మనోజ్‌కు అండగా నిలిచాడు. దీంతో 38.5 ఓవర్లలోనే పృథ్వీ సేన లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. ఇంతకుముందు మూడు టైటిళ్లతో ఆస్ట్రేలియాతో సమానంగా ఉండింది. 102 బంతుల్లో అజేయ సెంచరీ చేసిన ఢిల్లీ కుర్రాడు మనోజ్ కల్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

      పృథ్వీ షా అవుటయ్యాక బరిలోకి దిగిన మనోజ్ చివరి వరకు ఉండి జట్టును ఒడ్డుకు చేర్చాడు. కాగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ నాలుగో గెలుపుతో అత్యధిక అండర్-19 వరల్డ్ కప్ టైటిళ్లను గెలిచిన జట్టుగా భారత్ నిలిచి ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టింది. ఈ ఘనత అంతా కుర్రాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచేలా నడింపించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుంది. ద్రవిడ్ శిక్షణలోని యువ జట్టు 2016 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు తిరుగులేని ఫేవరెట్స్‌గా బరిలోకి దిగారు. ఒకరు కాకపోతే మరొకరుగా కుర్రాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. లక్ష్యం దిశగా పోరాడే విషయంలో భారత్ జట్టుకు, ఇతర జట్లకు మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. ఫైనల్‌కు ఎంపిక చేసిన భారత తుది జట్టులో ఐదుగురు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఉండగా.. ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ జాసన్ సంఘ ఒక్కడే ఉన్నాడు.
 
కెప్టెన్ షా, శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత మనోజ్ చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. 22వ ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 131 పరుగుల వద్ద గెలుపుకు మరో 86 పరుగులు కావాల్సిన పరిస్థితిలో హార్విక్ దేశాయ్.. మనోజ్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇదే ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్స్ 86 పరుగులు చేసిన మనోజ్ మరోసారి రెచ్చిపోయాడు. స్పిన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు కొట్టడమే కాకుండా పేస్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్స్ ఆడి తన అందమైన బ్యాటింగ్‌ను మనోజ్ ప్రదర్శించాడు. చివరికి మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. దేశాయ్ ఫోర్ కొట్టడంతో జట్టు సహచరులందరూ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన మనోజ్‌ను హత్తుకున్నారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను భారత యువ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఆరంభంలో భారత్ ఒత్తిడికి గురైంది. ఎందుకంటే మాక్స్‌బ్రియాంట్ 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు కఠినమైన క్యాచ్‌ను భారత్ చేజార్చింది. వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ మొత్తంగా మూడు క్యాచ్‌లు చేజార్చాడు. మరో రెండుసార్లు ఓవర్ త్రో వేశారు. దీంతో ఆస్ట్రేలియాకు అనవసర పరుగులు వచ్చాయి. ఓపెనర్లు బ్రియాంట్, ఎడ్వర్డ్స్ శుభారంభాన్నిచ్చారు. బ్రియాంట్‌ను అదృష్టం వరించగా.. మరో ఎండ్‌లో ఉన్న ఎడ్వర్డ్స్ కండ బలం చూపించాడు. దీంతో ఆస్ట్రేలియా ఐదు ఓవర్లలో 32 పరుగులు చేసింది. శివం మవి ఒక ఓవర్లో 12 పరుగులిచ్చాడు. తర్వాత ఇషాన్ పోరెల్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. బ్రియాంట్ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అభిషేక్ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఎడ్వర్డ్స్‌ను కూడా పోరెల్ పెవిలియన్ పంపాడు. తర్వాత కెప్టెన్ జాసన్ సంఘను నగర్‌కోటి అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. భారత్ పైచేయి సాధించింది.

            తర్వాత వచ్చిన మెల్రో, పరమ్ ఉప్పల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ భారత స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని విడగొట్టేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. స్పిన్ బౌలింగ్‌లో ఉప్పల్ చాలా సౌకర్యవంతంగా ఆడాడు. మరోవైపు మెల్రో బంతిని నిదానంగా గమనించి షాట్లు కొట్టాడు. వీరిద్దరు 14 స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో 22 పరుగులు రాబట్టారు. చివరికి అనుకుల్ రాయ్ ఈ జోడీని విడగొట్టాడు. రాయ్ వేసిన బంతిని ఉప్పల్ లెగ్ సైడ్ ఆడబోయి అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్ కీలకంగా మారింది. ఆ తర్వాత జట్టుకు పరుగులు అందించే బాధ్యతను మెర్లో తీసుకున్నాడు. 60 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత నాథన్ మెక్‌స్వీనీ బంతిని పుష్ చేయబోయి బౌలర్ శివ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తర్వాత వచ్చిన సూదర్లాండ్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 42 ఓవర్లు ముగిసే సమయానికి 191 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు ఓపికగా ఆడిన మెర్లో అనవసరమైన రివర్స్ షాట్ ఆడి శివ సింగ్ చేతికి చిక్కాడు. మిగిలిన ముగ్గురిని కూడా భారత బౌలర్లు త్వరగానే పెవిలియన్‌కు పంపారు.

ద్రవిడ్ శిష్యులు తమ గురువు పేరు నిలబెట్టారు. 125 కోట్ల భారత అభిమానుల ఆంచనాలను పృథ్వీ సేన అందుకుంది. ఐసీసీ prithvisenaఅండర్-19 వరల్డ్ కప్‌లో టైటిల్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. భారత ఈ టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి. ఈ టోర్నీలో భారత యువ జట్టు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి చివరి వరకు జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేస్తూ ముందుకు సాగారు. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. యువకులు సాధించిన ఈ ఘనతకు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందిస్తోంది.
 
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఎడ్వర్డ్స్ (సి) నగర్‌కోటి (బి) పోరెల్ 28, బ్రియాంట్ (సి) అభిషేక్ (బి) పోరెల్ 14, జాసన్ సంఘ (సి) దేశాయ్ (బి) నగర్‌కోటి 13, మెర్లో (సి) శివ సింగ్ (బి) రాయ్, ఉప్పల్ (సి) అండ్ (బి) 34, మెక్‌స్వీనీ (సి) అండ్ (బి) శివ సింగ్ 23, సూదర్లాండ్ (సి) దేశాయ్ (బి) శివ సింగ్ 5, హోల్ట్ రనౌట్ 13, ఇవాన్స్ (బి) నగర్‌కోటి 1, హాడ్లే (సి) దేశాయ్ (బి) శివం మవి 1, పోప్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం 47.2 ఓవర్లలో 216 ఆలౌట్; వికెట్ల పతనం: 1-32, 2-52, 3-59, 4-134, 5-183, 6-191, 7-212, 8-214, 9-216, 10-216; బౌలింగ్: శివం మవి: 8.2-1-46-1, పోరెల్: 7-1-30-2, శివ సింగ్: 10-0-36-2, నగర్‌కోటి: 9-0-41-2, అభిషేక్: 6-0-30-0, రాయ్: 7-0-32-2.

ఇండియా ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సూదర్లాండ్ 29, మనోజ్ కల్రా నాటౌట్ 101, శుభ్‌మన్ గిల్ (బి) ఉప్పల్ 31, దేశాయ్ నాటౌట్ 47; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం 38.5 ఓవర్లలో 220/2; వికెట్ల పతనం: 1-71, 2-131; బౌలింగ్:  హాడ్లే: 7-0-37-0, ఇవాన్స్: 5-1-30-0, సూదర్లాండ్: 6.5-0-36-1, ఎడ్వర్డ్స్: 1-0-15-0, పోప్: 5-0-42-0, మెర్లో: 4-0-21-0, ఉప్పల్: 10-0-38-1.ఆపరేషన్ వరల్డ్ కప్

Updated By ManamFri, 02/02/2018 - 17:31
 • నాలుగో టైటిల్‌పై భారత యువ సేన దృష్టి 

 • రేపు ఆస్ట్రేలియాతో తుది పోరు 

 • ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్

under19cricketerమౌంట్‌మాంగనుయ్: ఓటమి ఎరుగని జట్టుగా కొనసాగుతున్న భారత యువ జట్టు నాలుగో టైటిల్‌పై దృష్టి సారించింది. రాహుల్ ద్రవిడ్ శిక్షణలోని పృథ్వీ సేన రికార్డు బుక్కులను తిరగరాసేందుకు సిద్ధమైంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్లు శనివారమిక్కడ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు ఇండియా, ఆస్ట్రేలియా. ఎందుకంటే ఈ రెండు జట్లూ చెరి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాయి. అయితే శనివారం నాటి ఫైనల్లో ఆస్ట్రేలియా భరతం పట్టేందుకు ద్రవిడ్ శిక్షణలోని స్ఫూర్తిదాయక కుర్రాళ్లు ఎప్పుడెప్పాడా అని ఎదురు చూస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న పృథ్వీ షా భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించే సూచనలు కనిస్తున్నాయి.

భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ టైటిళ్లు అందించిన మహ్మద్ కైఫ్ (2002), విరాట్ కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2012) సరసన నిలవాలని షా పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తూ ఫైనల్లో ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 100 పరుగులతో, సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 203 పరుగులతో గెలుపుతో పాటు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచి తిరుగులేని జట్టుగా నిలిచింది. ముఖ్యంగా సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై గెలుపు భారత కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. తొలుత 272 పరుగులు చేసిన భారత జట్టు తర్వాత పాకిస్థాన్‌ను 69 పరుగులకు ఆలౌట్ చేసింది. ద్రవిడ్ శిష్యులందరూ కలిసికట్టుగా రాణించారు. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ భారత జట్టు సొంతం. షా, మనోజ్ కల్రా ఈ టోర్నీ ఆద్యంతం జట్టుకు శుభారంభాన్నిచ్చారు. మూడో నంబర్ స్థానంలో శుభ్‌మన్ గిల్ అసాధారణ ఫామ్ కనబరుస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ టోర్నీలో అత్యంత స్థిరంగా రాణిస్తున్న గిల్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. సెమీస్‌లో పాకిస్థాన్‌పై మిరుమిట్లు గొలిపే అజేయ సెంచరీ చేసిన గిల్ తుదిపోరులోనూ ఆదే జోరును కనబరచాలని ఎదురు చూస్తున్నాడు.

బౌలింగ్ విభాగానికొస్తే.. శివం మవి, కమలేష్ నగర్‌కోటి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే బౌలింగ్ చేస్తున్నారు. అయితే బలమైన ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బ తీసేందుకు భారత బౌలర్లు తమ ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. మరొక ముఖ్యమైన ఆటగాడు అభిషేక్ శర్మ. స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఎదుర్కోలేని ఆస్ట్రేలియా బలహీనతపై దెబ్బ కొట్టేందుకు అభిషేక్‌తో పాటు అనుకుల్ రాయ్ సిద్ధమయ్యారు. స్పిన్ బౌలింగ్‌తో పాటు మిడిలార్డర్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాడు అభిషేక్. ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. భవిష్యత్ స్టార్ క్రికెటర్లను తయారు చేయడంతో ఇండియా అండర్-19 వారసత్వాన్ని తీసుకుంది. భారత్ క్రికెట్‌లో సంచలనం సృష్టించగల సామర్థ్యం ప్రస్తుత యువకులకు ఉంది.

మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమికి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా తహతహలాడుతోంది. భారత్ చేతిలో ఓడిన తర్వాత ఆస్ట్రేలియా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సందర్భాన్ని బట్టి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించగలమని జాసన్ సింఘా సేన గత రెండు మ్యాచ్‌ల్లో సంకేతాలు పంపింది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 31 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులను నిలబెట్టుకుంది. మొత్తానికి తుదిపోరులో ఇండియా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇండియా అండర్-19: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, మనోజ్ కల్రా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, హార్విక్ దేశాయ్, శివం మవి, కమలేష్ నగర్‌కోటి, ఇషాన్ పోరెల్, అనుకుల్ రాయ్, శివ సింగ్, ఆర్యన్ జుయాల్, అర్ష్‌దీప్ సింగ్, పంకజ్ యాదవ్.

ఆస్ట్రేలియా అండర్-19: జాసన్ సంఘ (కెప్టెన్), విల్ సూథర్లాండ్, జేవియర్ బార్ట్‌లెట్, మాక్స్ బ్రియాంట్, జాక్ ఎడ్వర్డ్స్, జాక్ ఇవాన్స్, జర్రోడ్ ఫ్రీమన్, రియాన్ హాడ్లే, బాక్స్‌టర్ జె. హాల్ట్, నాథన్ మెక్‌స్వీనీ, జోనాథాన్ మెర్లో, లాయిడ్ పోప్, పరమ్ ఉప్పల్, ఆస్టిన్ వా.ఫైనల్‌కు చేరిన యువ భారత్

Updated By ManamTue, 01/30/2018 - 18:21
 • శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీ

 •  ఇషాన్ పోరెల్‌కు 4 వికెట్లు

 • సెమీఫైనల్లో పాకిస్థాన్ ఘోర పరాజయం

 •  శనివారం ఆస్ట్రేలియాతో తుదిపోరు

under19cricketerక్రైస్‌చర్చ్: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను యువ భారత్ మరోసారి నిర్దాక్షిణ్యంగా చితగ్గొట్టింది. మంగళవారమిక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా 203 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ కోసం తలపడతాయి. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీ (102) చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. తర్వాత పాకిస్థాన్ 69 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ పోరెల్ 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్‌కు అతి స్వల్ప స్కోరు. ఇండియా ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు ముమ్మద్ ముసా (4/67), అర్షద్ ఇక్బాల్ (3/51) ఇండియా మిడిలార్డర్‌ను దెబ్బ తీశారు. అయితే గిల్ తన సెంచరీతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. అండర్-19 వన్డేల్లో గిల్ 50కిపైగా పరుగులు చేయడం వరుసగా ఇది ఆరోసారి. సెమీఫైనల్లో గెలవాలంటే పాకిస్థాన్ జట్టు శక్తికిమించి పోరాడాల్సివుండింది. ఒకవేళ పాక్ గెలిచివుంటే ఇది అత్యుత్తమ లక్ష్య ఛేదన అయ్యేది. కానీ గెలుపు లక్ష్యం పాక్ జట్టుకు కొండలా నిలిచింది. 
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీ షా, మనోజ్ కల్రా మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షాకు రెండుసార్లు లైఫ్ లభించింది. 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు షహీన్ బౌలింగ్‌లో ఒకసారి. 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు హసన్ ఖాన్ బౌలింగ్‌లో రెండోసారి జైద్ ఆలమ్ క్యాచ్‌లను చేజార్చాడు. కానీ అర్ధ సెంచరీకి దగ్గరగా వచ్చిన షా దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. తర్వాత శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత ముసా బౌలింగ్‌లో మనోజ్ అవుటయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. గిల్ ఎండ్‌లో చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో పాక్ బౌలర్లు మరో ఎండ్‌పై దృష్టి పెట్టారు. అర్షద్ ఇక్బాల్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మలను తక్కువ పరుగులకే పెవిలియన్ పంపాడు. ఇండియా ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నాడు. ఒకవేపు పాక్ బౌలర్లను చిత్తగ్గొడుతూనే దేశాయ్‌తో కలిసి 54 పరుగులు, అనుకుల్ రాయ్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముసా బౌలింగ్‌లో రాయ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య శుభ్‌మన్ సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల వద్ద శుభ్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను హస్సన్ చేజార్చడంతో మూడంకెల స్కోరును చేసుకున్నాడు. తీరా చూస్తే అది నో బాల్ అయింది. ఫ్రీ హిట్‌లో మరో రన్ వచ్చింది. ఇండియా ఇన్నింగ్స్ చివర్లో పాకిస్థాన్ క్రికెటర్లు మరింత ఒత్తిడికి లోనయ్యారు. పేలవమైన ఫీల్డింగ్‌తో అందరూ చిరాకు పడ్డారు. పాక్ క్రికెటర్ల మిస్‌ఫీల్డింగ్, నో బాల్స్‌తో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ క్రికెటర్లను భారత పేస్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. శివం మవి ఒక ఎండ్‌లో వరుసగా మూడు మెయిడెన్ ఓవర్లు వేసి ఒత్తిడి పెంచాడు. మరో ఎండ్‌లో ఇషాన్ పోరెల్ వికెట్లు పడగొట్టాడు. జైద్ ఆలమ్, ఇమ్రాన్ షా, అలీ జర్యాబ్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైంది. తర్వాత పోరెల్ నాలుగో వికెట్‌గా అహ్మద్ ఆలమ్‌ను అవుట్ చేశాడు. తర్వాత స్పిన్నర్ల వంతు వచ్చింది. శివ సింగ్ బౌలింగ్‌లో మహ్మద్ తాహ వెనుదిరిగాడు. శివ రెండు వికెట్లు తీశాడు. తర్వాత రొహైల్ నజీర్‌ను రియాన్ పరాగ్ పెవిలియన్ పంపాడు. తర్వాత హస్సన్, అఫ్రీది కూడా జట్టును ఆదుకోలేకపోయారు. మొత్తంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో సాద్ ఖాన్, మూసా కలిసి తొమ్మిదో వికెట్ 20 పరుగులు చేయడం అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. శివ బౌలింగ్‌లో మూసా లాంగాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అర్షద్ ఇక్బాల్ అవుట్ కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఫైనల్‌కు చేరుకుంది. 


స్కోరు బోర్డు
ఇండియా అండర్-19 ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 41, మనోజ్ కల్రా (సి) రొహైల్ నజీర్ (బి) ముసా 47, శుభ్‌మన్ గిల్ నాటౌట్ 102, దేశాయ్ (సి) సాద్ ఖాన్ (బి) అర్షద్ ఇక్బాల్ 20, పరాగ్ (సి) రొహైల్ (బి) అర్షద్ 2, అభిషేక్ శర్మ (సి) రొహైల్ (బి) అర్షద్ 5, రాయ్ (సి) రొహైల్ (బి) ముసా 33, నగర్‌కోటి (బి) అఫ్రీది 1, శివం మవి (సి) అండ్ (బి) ముసా 10, శివ సింగ్ ఎల్‌బిడబ్ల్యూ (బి) ముసా 1, పోరెల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం 50 ఓవర్లలో 272/9; వికెట్ల పతనం: 1-89, 2-94, 3-148, 4-156, 5-166, 6-233, 7-242, 8-265, 9-267; బౌలింగ్: అర్షద్ ఇక్బాల్: 10-0-51-3, మహ్మద్ ముసా: 10-0-67-4, షహీన్ షా అఫ్రీది: 10-0-62-1, హసన్ ఖాన్: 10-0-46-0, మమ్మద్ తాహ: 7-0-35-0, అలి జర్యాబ్ ఆసిఫ్: 3-0-11-0.
పాకిస్థాన్ అండర్-19 ఇన్సింగ్స్: ఇమ్రాన్ షా (సి) పృథ్వీ షా (బి) పోరెల్ 2, జైద్ ఆలమ్ (సి) శివం మవి (బి) పోరెల్ 7, రొహైల్ నజీర్ (సి) శుభ్‌మన్ (బి) పరాగ్ 18, అలీ జర్యాబ్ ఆసిఫ్ (సి) పృథ్వీ షా (బి) పోరెల్ 1, అమ్మద్ ఆలమ్ (సి) శివం మవి (బి) పోరెల్ 4, మొహ్మద్ తాహ (సి) నగర్‌కోటి (బి) శివ సింగ్ 4, సాద్ ఖాన్ (స్టంప్డ్) దేశాయ్ (బి) రాయ్ 15, హసన్ ఖాన్ (సి) శుభ్‌మన్ (బి) పరాగ్ 1, షహీన్ షా అఫ్రీది (సి) అండ్ (బి) శివ సింగ్ 0, ముహ్మద్ ముసా నాటౌట్ 11, అర్షద్ ఇక్బాల్ (సి) పోరెల్ (బి) అభిషేక్ శర్మ 1, ఎక్స్‌ట్రాలు: 5, వికెట్ల పతనం: 1-10, 2-13, 3-20, 4-25, 5-37, 6-41, 7-45, 8-48, 9-68, 10-69; బౌలింగ్: శివం మవి: 4-3-6-0, పోరెల్: 6-2-17-4, నగర్‌కోటి: 5-1-7-0,  శివ సింగ్: 8-0-20-2, పరాగ్: 4-1-6-2, రాయ్: 2-0-11-1, అభిషేక్ శర్మ: 0.3-0-0-1.

Related News