tdp

'టీడీపీలోనే ఉన్నా.. రాజీనామా చేయలేదు'

Updated By ManamMon, 09/10/2018 - 20:29

TDP, R Krishnaiah, BC welfare committee, BC meetingహైదరాబాద్‌: ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. టీడీపీకి తాను రాజీనామా చేయలేదని నొక్కివక్కాణించారు. అబిడ్స్ సిద్ధార్థ హోటల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 112 బీసీ కులాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఎల్‌బీ నగర్ నుంచే తాను పోటీ చేయనున్నట్టు చెప్పారు.

అక్కడి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాబోయే కీలక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 65 సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శివార్లపైనే టీడీపీ టార్గెట్!

Updated By ManamMon, 09/10/2018 - 13:37
 • సెక్యూలర్ ఓట్లు రాబట్టే యత్నం...

TDP eyes to sweep city outskirts of hyderabad seats in Telangana assembly elections

హైదరాబాద్ : గత ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిన టీడీపీ ఈసారి కూడా ఎన్నికల్లోను సత్తా చాటాలనుకుంటోంది. తమ అభ్యర్థులపై ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీలో పోటీ చేసి గెలిచిన వారు పార్టీ వీడి పోయినా కార్యకర్తల బలం తగ్గలేదని సమాచారం.

కాంగ్రెస్, టీడీపీతో పొత్తుకు ఇరు వర్గాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినా నగర శివార్లలో మాత్రం తమ పార్టీకే మంచి మద్దతు ఉన్నదని టీడీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నగర శివారుల్లో తమ పార్టీ అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కోరనుంది.

గత ఎన్నికల్లో ఎల్‌బినగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రానగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలలో విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారినా ఓట్లు మాత్రం ప్రజల్లో టీడీపీకే సానుకూల స్పందన ఉన్నట్టు సమాచారం. 

ఎక్కువ శాతం సెక్యూలర్ ఓట్లు ఉన్నందున తమ పార్టీ అభ్యర్థులనే నిలబెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో దేవేందర్‌గౌడ్‌కు గట్టి పట్టు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లిలోనూ బలమైన క్యాడర్ ఉందని ఇక్కడ గతంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించడంతో తమ అభ్యర్థినే నిలబెట్టేందుకు సన్నద్దమవుతోంది.

ఉప్పల్‌లో గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడని, ఇక్కడ నుంచి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించ నున్నట్టు సమాచారం. కూకట్‌పల్లిలోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, తమ అభ్యర్థికే ఇక్కడి నుంచి టికెట్ కేటాయించేలని పార్టీ వర్గాలు కాంగ్రెస్‌ను కోరనున్నట్టు సమాచారం.

ఇబ్రహీంపట్నంలో గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఇప్పటికీ అక్కడ పార్టీ బలంగా ఉందని, తమ అభ్యర్థి తప్పనిసరిగా పోటీ చేస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్‌లోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, ఇక్కడి నుంచి కూడా తమ అభ్యర్థికే టికెట్ ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తమ పార్టీ నుంచి గెలిచిన నేతలు వలస వెళ్లినా క్యాడర్ బలంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ తమకే అధికంగా సీట్లు వస్తాయని ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: డిప్యూటీ సీఎం

Updated By ManamMon, 09/10/2018 - 11:08

KE Krishnamurthyహైదరాబాద్: ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన పాపంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోమని తెలిపారు. ఏపీకి మొండి చేయి చూపిన మోదీ నమ్మక ద్రోహి అని, ఏపీ విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రధాని ముఖ్యమంత్రి అపవాదు వేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య గొడవ పెట్టేందుకు మోదీ సిద్ధమయ్యారని తూర్పారబట్టారు. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే సీపీఐతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.టీడీపీలోకి వైసీపీ మరో కీలక నేత..?

Updated By ManamMon, 09/10/2018 - 08:57

neelakantamఅమరావతి: తెలంగాణలో ఎన్నికల వేడి ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైకాపా కీలక నేత మీసాల నీలకంఠంనాయుడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో నీలకంఠం నాయుడు ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది.

కాగా వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నీలకంఠంనాయుడు 2014కు ముందు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. ఆయనకు దగ్గలేదు. దీంతో తాజాగా టీడీపీలోకి వచ్చేందుకు నీలకంఠం నాయుడు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఏడాది కిందటే ‘పొత్తు’పొడుపు!

Updated By ManamSun, 09/09/2018 - 23:28
 • తెలంగాణలో టీడీపీ ఆరాటం.. ఆంధ్రాలో కాంగ్రెస్ తాపత్రయం

 • వ్యూహంతోనే బాబు అడుగులు.. ప్రత్యేక హోదాపై హస్తం హామీ

 • ఊతమిచ్చిన రాహుల్ ప్రకటన.. ‘కన్నడ’ ఎన్నికలతో అవగాహన!

 • ‘చేతి’తో పొత్తు రాష్ట్రానికి లాభం.. ప్రజల్లోకి తీసుకెళ్లనున్న బాబు

TDP-CONGRESSఅమరావతి: కాంగ్రెస్, టీడీపీ పొత్తు కొంతమందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. అయితే ఈ పొత్తుకు ఏడాది కిందటే బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. రేవంత్‌రెడ్డి టీడీపీని గవీడి కాంగ్రెస్‌లో చేరినప్పడే పొత్తుపొడుపు పొడిచిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ పొత్తు ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుందని జోరుగా చర్చ సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడికి తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి  కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే టీడీపీ అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకునేవారు. అలాంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఈ పొత్తు ఇప్పటికిప్పుడు ఏర్పడిందా..? పరిస్థితులు అలా దారితీశాయా..? అనే అంశాలు నిశితంగా పరిశీలిస్తే పొత్తు చిక్కుముడి అవగతమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయి. ముఖ్యంగా ఏపీలో తమ ప్రభావం తగ్గిపోతుందని తెలిసినా యూపీఏ ప్రభుత్వం తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజనను చకచకా పూర్తిచేసింది. తెలంగాణ ఏర్పాటుకు అతిపెద్ద ప్రాంతీయ పార్టీ టీడీపీ కూడా అంగీకరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విభజన తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందని భావించారు. అయితే టీఆర్‌ఎస్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్‌లో నాయకత్వలోపం, టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నాయకత్వం వెరసి తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఆంధ్ర వ్యక్తిగా టీడీపీని ఆంధ్రపార్టీగా టీఆర్‌ఎస్ ముద్రవేసింది. దీంతో తెలంగాణలో కేడర్ ఉన్నప్పటికీ టీడీపీ ఉనికిని అంచలంచలుగా కోల్పోతూ వచ్చింది. తెలంగాణ ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి, ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుపార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ నేతనే అవుతారు. ఆంధ్రాలో టీడీపీ గెలిచినా సీఎం చంద్రబాబు అవుతారు. ఈ లెక్కన పొత్తు అనేది అధికారం కోసం కాదు, ఉనికి కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

మరి ఆంధ్రాలో టీడీపీ పరిస్థితి..?
తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీకి లాభించే అంశమైతే, ఆంధ్రలో మాత్రం ప్రతికూలం అంశమే. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు తగిన వ్యూహరచన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపై చేస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. ఇదే హామీని చంద్రబాబు బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు. ఏపీకి మేలు చేసే పార్టీతో జతకడితే తప్పేంటనే భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించిన సీనియర్ నేతలను కూడా బాబు చాకచక్యంగా బుజ్జగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చారు. గత ఏడాది నవంబరులో అంటే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సమయంలోనే కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఆ సమయంలోనే కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచనతో మొదలైందని అంటున్నారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు కలిసి జనాలకు అభివాదం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య మైత్రి ఖరారైందని అందరూ చెప్పుకున్నారు. విభజన సందర్భంగా తాము చేసిన తప్పును సరిదిద్దుకుంటామని, ఆంధ్రాకు న్యాయం చేస్తామని ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్ధానాలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. కాంగ్రెస్‌తో పొత్తు మంచిదేనని చంద్రబాబు మున్ముందు ప్రచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.ఆంధ్రా పార్టీకాదు...అందరి పార్టీ

Updated By ManamSat, 09/08/2018 - 17:26
l ramana

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు.  టీడీపీ ఆంధ్రుల పార్టీ అన్న కేసీఆర్... గతంలో టీడీపీ ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.  

టీడీపీ ఆంధ్రా పార్టీ కాదని అందరి పార్టీ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ హైదరాబాద్‌లోనే ఉందని అన్నారు. తెలంగాణలో అప్పులు ఎలా పెరిగాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఖాయం అని ఎల్ రమణ వ్యాఖ్యానించారు. 

కాగా తెలంగాణలో  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాదులోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పొత్తులపైనే చర్చ జరిగింది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో చంద్రబాబు...పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ భూస్థాపితం అవుతుంది

Updated By ManamSat, 09/08/2018 - 15:24

ramachandra reddyఅమరావతి: కాంగ్రెస్‌తో టీడీపీ అంటకాగడం కొత్తకాదని, గతంలో కిరణ్ సర్కారు పడిపోకుండా చంద్రబాబు కాపాడారని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు కురిపించారు. కిరణ్‌ను కాంగ్రెస్‌లో తిరిగి చేర్పించింది చంద్రబాబేనని, కిరణ్ తమ్ముళ్లను స్మగ్లర్లు అన్న చంద్రబాబు, వాళ్లకే కేబినెట్ ర్యాంకు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, కాంగ్రెస్‌లో పొత్తు వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదని రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆత్మగౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు వలన వైసీపీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఇక రెయిన్‌గన్‌లతో 4లక్షల ఎకరాలకు నీరిచ్చినట్లు నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై కీలక నిర్ణయం..

Updated By ManamFri, 09/07/2018 - 18:58
 • రేపు హైదరాబాద్ రానున్న సీఎం చంద్రబాబు

 • ఉత్తమ్ ప్రతిపాదనపై టీటీడీపీలో చర్చ.. ఉత్తమ్‌కు రమణ ఫోన్.. 

Chandrababu naidu, TDP, Congress, Uttam kumar reddy హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై శనివారం కీలక నిర్ణయం వెల్లడి కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనపై తెలంగాణ టీడీపీలో చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి పొత్తు విషయమై చర్చిద్దామని చెప్పినట్టు తెలిసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) హైదరాబాద్‌కు రానున్నట్టు తెలుస్తోంది. దాంతో చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పొత్తులపై టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. 

తెలంగాణలో పరిణామాలపై మంత్రులు, నేతలతో రేపు లేక్‌వ్యూలో ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 11.30 వరకు చంద్రబాబు చర్చ జరపనున్నారు. తెలంగాణలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని ఇప్పటికే చంద్రబాబు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ కార్యవర్గ భేటీ అయ్యే అవకాశం ఉంది. 
 

తెలంగాణలో కాంగ్రెస్‌దే ప్రభుత్వం: ఉత్తమ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలంగాణ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం వస్తోందన్నారు. ఈసీతో మాట్లాడి రద్దు చేశామని కేసీఆర్ చెబుతున్నారని, దుర్మార్గపు పాలన నుంచి విముక్తి పొందామని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.జయహో బీసీ!

Updated By ManamThu, 09/06/2018 - 07:11
 • దేశంలో సగం- టీడీపీతో మనం.. మహానాడు తరహా 2 రోజుల సదస్సు

 • తొలిరోజు బీసీకులాలతో సమావేశం.. రెండోరోజు భారీ బహిరంగ సమావేశం

 • అక్టోబరు నాలుగో వారంలో ఏర్పాటు.. పార్టీ వ్యూహాలు బయటకు వెళ్తే ఎలా?

 • గ్రూపు విభేదాలకు పూర్తిగా స్వస్తిచెప్పండి.. టీడీపీ వర్క్‌షాప్‌లో నేతలతో చంద్రబాబు

అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీకి  తొలి నుంచి బీసీలే అండదండ. వారి రుణం తీర్చుకోవడం మన బాధ్యత. అందుకే రాష్ట్రంలోని బీసీలందరినీ ఒక దగ్గర చేర్చేందుకు ‘దేశంలో సగం-తెలుగుదేశంతో మనం’ ట్యాగ్ లైన్‌తో త్వరలో ‘జయహో బీసీ’ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.’’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడారు. మహానాడు తరహాలో బీసీ సదస్సు రెండు రోజులు ఉంటుందని, తొలి రోజు అన్ని బీసీ కులాల వారితో సమావేశాలు ఉంటాయని, రెండో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విజయదశమి తరువాత అక్టోబరు నాలుగో వారంలో బీసీ సదస్సు ఏర్పా టు చేయాలని వర్క్‌షాప్‌లో నేతలు నిర్ణయించారు. నెల్లూరు ‘దళిత తేజం-తెలుగుదేశం’ సదస్సుకు లక్షమంది పైగా హాజరయ్యారని... రెండు ఎస్సీ ఉపకులాల వారు టీడీపీ తమదిగా భావించి హాజరై  కార్యక్రమాన్ని విజయవంతం చేశార ని చంద్రబాబు గుర్తుచేశారు. సభకు అత్యంత భారీగా హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.
 

image


నేతలంతా సంఘటితంగా ఉండాలి
‘‘టీడీపీలో తొలి ప్రాధాన్యం బీసీలకే. పదవుల్లో, సంక్షేమంలో, అభ్యున్నతిలో బీసీలకే పెద్దపీట. టీడీపీ చేస్తున్న అన్ని పనుల్లో తొలి తాంబూలం వారికే. పేదరికంలేని, ఆర్థిక అసమానతలు లేని సమాజం ఏర్పాటే పార్టీ లక్ష్యం. క్రమశిక్షణ లేని పార్టీ, కట్టుబాటులేని కుటుంబం కుప్పకూలుతాయి. పార్టీలో ఎంతమంది ఉన్నారనేది కాదు.. ఎంత ఐక్యంగా ఉన్నారనేది ముఖ్యం. మన కర్రతో మన ం కొట్టుకుంటే దెబ్బ తగులుతుందా లేదా..? అలాగే రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి. కానీ మన వ్యూహాలు, ప్రతివ్యూహాలు బయటకు వెళ్లకూడదు. మన కాళ్లకు మనమే బంధాలు వేసుకుంటే ముందుకు పోలేం. ఎన్నికల ముందు అందరూ సంఘటితంగా ఉండాలి. గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి.’’ అని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. 

బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎండగడతాం: మంత్రి కాల్వ
బీజేపీ చేస్తున్న నమ్మకద్రోహన్ని గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని సభ సాక్షిగా ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. 2014కు ముందు రాష్ట్రం ఏమవుతుందో అని ప్రజలందరిలో ఆందోళన ఉందని,అలాంటిది అసాధ్యాన్ని చంద్రబాబు సుసాధ్యం చేశారని మంత్రి కాల్వ ప్రశంసించారు. 

హరికృష్ణకు సంతాపం...
ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన పార్టీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం వెలిబుచ్చారు. టీడీపీ వర్క్‌షాప్‌లో సంతాప తీర్మానాన్ని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రవేశపెట్టారు. చైతన్య రథ సారథిగా 78 వేల కిలోమీటర్లు ఒక్క ప్రమాదం లేకుండా హరికృష్ణ నడిపారని గుర్తుచేశారు. అలాంటిది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు. తెలుగుయువత అధ్యక్షునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా పార్టీకి అనేక సేవలు అందించారని కళా వెంకట్రావు కొనియాడారు. కర్నూలు జిల్లాలో వసూల్ ‘రాజా’

Updated By ManamWed, 09/05/2018 - 16:33
 •     20శాతం పర్సంటేజి ఇస్తేనే పని.. ఎమ్మెల్యే దొరగారి నిర్వాకం

 •     ప్రజా సమస్యలు బలాదూర్, ముడుపులొచ్చే పనులే భేష్

 •     సొంత పార్టీ వారైనా అంతే, లంచాలు లేనిదే పనిలేదు

 •     పదవుల పంపకమూ అలాగే,  కర్నూలు జిల్లాలో విచిత్రం

 •     ముడుపుల వసూళ్లకు ఇద్దరు, చిన్న పోస్టుకూ తప్పని లంచం

 •     హడలిపోతున్న కాంట్రాక్టర్లు, ఆగిపోతున్న అభివృద్ధి పనులు

kurnool tdp mla

కర్నూలు : ‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తన కర్తవ్యాలను, శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం, పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాలను, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని’ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ ఎమ్మెల్యే ప్రజల అభివృద్ధి మాని.. తన సొంత లాభం చూసుకునే పనిలో పడ్డారు. ప్రజాసమస్యలు తీర్చడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయుల నిధులు విడుదల చేస్తే, అందులో కొన్ని లక్షలు వెనకేసుకుంటున్నారు. 

పర్సంటేజి ఇస్తే తప్ప అసలు పనులు ప్రారంభమే కావడం లేదు. కాంట్రాక్టర్లు ఇలా పర్సంటేజీలు ఇవ్వలేక.. పనులు చేయకుండా వదిలేసిపోతున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడు తోంది. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వసూల్ ‘రాజా’ అవతారం ఎత్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు మొదలు కాంట్రాక్టు పనుల వరకు ప్రతి పనికీ ఆయన నిర్ణయించిన ముడుపులు చెల్లిస్తే తప్ప అక్కడ పని జరగడంలేదు. ఇటీవల నియోజకవర్గానికి నీరు- చెట్టు కింద కోట్లాది రూపాయల నిధులు వచ్చాయి. ఈ పనులను గ్రామీణ స్థాయిలోని నేతలకు ఇవ్వాలని సీఎం నుంచే నేరుగా ఆదేశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెబుతున్నారు. 

ఎమ్మెల్యే మాత్రం అది పట్టించుకోకుండా ఎవరు 20శాతం ఇస్తే వారికే పనులు కట్టబెడుతున్నారు. అది కూడా ముందుగా ఇచ్చేవారికే. ఆలస్యం అయితే పర్సంటేజి సిద్ధం చేసినా ప్రయోజనం ఉండదు. తనకు ఎంత వీరాభిమాని అయినా, నిబద్ధతగల కార్యకర్త అయినా ముడుపు లేనిదే ఫైలు కదలదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నేత వాపోయారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల విషయంలోనూ, మోడల్ స్కూళ్ల పోస్టులు, దేవాలయాల్లోని పోస్టుల్లోనూ.. ఏజెన్సీ నిర్వాహకుల నుంచి భారీగా ముడుపులు దండుకున్నట్టు తెలుస్తోంది. ఇక చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు, ఎర్రమట్టి అక్రమ తవ్వకాల విషయంలో కూడా ముడుపులు చెల్లించేవారికే పనులు అప్పగించినట్టు సమాచారం. చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాండంతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పర్సంటేజీ చెల్లించకపోతే చిన్న పని కూడా జరగదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 

వసూళ్లకు ఇద్దరు ఛోటాలు 
అభివృద్ధి పనులకు నిధులు ఎన్ని విడుదలయ్యాయి..? ఎక్కడెక్కడ..? ఏయే పనులకు వచ్చాయన్న విషయం తెలుసుకోవడం, ఆ పనులకు ఎవరు 20% ఇస్తారో తెలుసుకోవడం, వారికి ఆ పనులు అప్పగించడం కోసం ఆ ఎమ్మెల్యే సమీప బంధువర్గానికి చెందిన ఇద్దరు ఛోటా నేతలను నియమించుకున్నారు. ఇద్దరికి చెరో రెండు మండలాలు అప్పగించారు.

వారు ఆ మండలాల్లో జరిగే పనుల వివరాలు తెప్పించుకుని ముడుపులు వసూలు చేసి ఎమ్మెల్యేకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నియోజకవర్గానికి రూ.80 కోట్లు వస్తే.. ముందుగా 20% ఇచ్చి టెండర్లలో పాల్గొనాలని హుకుం జారీ చేశారు. పని చేస్తే ఎంత లాభం వస్తుందో తెలియక టెండర్లు వేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో రూ.80 కోట్ల నిధులు వెనక్కు వెళ్లినట్టు సమాచారం. 

నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ మొండిచేయి
టీడీపీ పదేళ్లు అధికారంలో లేకపోయినా.. ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులకు తట్టుకుని నిలబడి పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వారిపట్ల కూడా ఆ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపుతున్నట్టు పలువురు నేతలు వాపోతున్నారు. మార్కెట్ యార్డులు, దేవాలయాల చైర్మన్లు, ట్రస్ట్‌బోర్డు మెంబర్లు తదితర పదవుల విషయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా తూకం ఎక్కువ ఇచ్చినవారికే పదవులు కట్టబెట్టినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో పార్టీ గెలుపు కోసం పనిచేయకపోయినా.. బంధు వర్గానికే పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ కార్యకర్తలు అంసతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ పెద్దలు రంగంలోకి దిగి పర్సెంటేజీల భాగోతానికి ఫుల్‌స్టాప్ పెట్టి పరిస్థితి చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

Related News